ఇద్దరు సూపర్‌స్టార్లు మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్
సల్మాన్, అమీర్ ఖాన్ నటించిన అందాజ్ అప్నా అప్నా.. చిత్రం బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ మాత్రమే.
అందాజ్ అప్నా అప్నా.. దీని అర్థం ``ఎవరి స్టైల్ వారికి ఉంటుంది``. 1994లో విడుదలైన ఈ హిందీ యాక్షన్ కామెడీ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించగా వినయ్ కుమార్ సిన్హా నిర్మించారు. దర్శకుడే రచయిత. ఇందులో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, కరిష్మా కపూర్, పరేష్ రావల్ (డబుల్ రోల్), శక్తి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 4 నవంబర్ 1994న విడుదలైంది. ఈ సినిమా మూల కథను తీసుకుని తరువాత పలు భాషల్లో సినిమాలు తీసారు. ఉల్లతై అల్లిత (1996), వీడెవడండీ బాబు (1997), గలాటే అలియాండ్రు (2000) వంటి చిత్రాలను తెరకెక్కించారు. బాలీవుడ్ సినిమాకి మక్కీకి మక్కీ తీయలేదు కానీ, దాని స్ఫూర్తిని ఉపయోగించుకుని ఈ సినిమాలన్నీ బాగానే ఆడాయి.
సల్మాన్, అమీర్ ఖాన్ నటించిన అందాజ్ అప్నా అప్నా.. చిత్రం బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ మాత్రమే. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా ఎప్పటికీ హృదయాల్లో నిలిచిపోయింది. ఈ చిత్రం క్లైమాక్స్ 1972 చిత్రం `విక్టోరియా నంబర్ 203` క్లైమాక్స్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. అందాజ్ అప్నా అప్నా (1994)లో ఆమిర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్లు నటించారు. తెరపై ఆ ఇద్దరూ ఎలా నటించినా కానీ సెట్లో ఆ ఇద్దరికీ మధ్య అస్సలు పొసగలేదు అనే విషయం ఎవరికైనా తెలుసా? షూటింగ్ అంతటా ఆ ఇద్దరు స్టార్లు గొడవ పడ్డారని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని కూడా టాక్ ఉంది.
దీనికి కారణం.. సల్మాన్ పాత్రను హైప్ చేస్తూ తనను దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి తగ్గించారని అమీర్ ఖాన్ భావించడమేనట. సల్మాన్ డైలాగులు బాగా పేల్తున్నాయి.. తనకు అలాంటివి లేవని కూడా అమీర్ ఫీలయ్యాడట. షూటింగ్ సమయంలో ఆ ఇద్దరి మధ్యా మాటలు లేకుండా పోయాయి. వారి మధ్య కోల్డ్ వార్ కొనసాగింది.
అహంతో ఒకరి ముఖం ఒకరు చూడటానికి కూడా ఇష్టపడలేదు.
అయితే ఎన్ని ఉన్నా కానీ సినిమాని పూర్తి చేసి, విడుదల చేసారు. అది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత సల్మాన్ తో పని చేయడం ఇష్టం లేదని అమీర్ ఖాన్ ఒప్పుకున్నాడు. కానీ కాలక్రమంలో శత్రుత్వం మటుమాయమైంది. కాలంతో పాటే మరపు. వారిని మళ్లీ కలిపింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 18లో కలిసిన సందర్భంలో అందాజ్ అప్నా అప్నాకు సీక్వెల్ తీస్తామని హింట్ ఇచ్చారు. అమీర్ `అందాజ్ అప్నా అప్నా 2` చేయాలని ఆటపట్టించగా, సల్మాన్ సానుకూలంగా స్పందించాడు. ఆసక్తికరంగా అందాజ్ అప్నా అప్నా చిత్రం ఏప్రిల్ 2025లో తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. నాటి సినిమాకి సీక్వెల్ తెరకెక్కితే చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అన్నీ కుదిరితే అమర్, ప్రేమ్‌లను మళ్లీ కలిసి చూడగలం. అయితే అప్పట్లో గొడవ పడినట్టే ఇప్పుడు ఇద్దరు పెద్ద స్టార్లు గొడవ పడే అవకాశం అయితే లేదు. ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అమీర్, సల్మాన్ లు జెంటిల్మన్ వ్యక్తిత్వంతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు కూడా.