ప్రభాస్‌ని జోకర్ అనేస్తాడా? మండి పడ్డ నిర్మాత!
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన `కల్కి 2898 ఏడీ` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన `కల్కి 2898 ఏడీ` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 1200 కోట్లు వసూలు చేసింది. దిగ్గజ ఫిలింమేకర్స్, ప్రముఖ స్టార్లు ఈ సినిమా నేరేషన్ ని ప్రశంసించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ప్రభాస్ లైటర్ వెయిన్ పాత్రలో కామెడీ చేస్తూ మెప్పించారని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు.
అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర ఒక జోకర్ లా ఉందని విమర్శించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు భగభగ మరుగుతున్నారు. అర్షద్ వార్షీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ నటుల గ్రడ్జ్ గురించి ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి బాసటగా నిలుస్తూ అర్షద్ పై విరుచుకుపడ్డారు. అతడి మైండ్ సెట్ మారాలని సూచించారు. మాటలు సరిగా ఉండాలని అర్షద్ ని హెచ్చరించారు. సమీక్షించడం లేదా విమర్శించడం మంచిదే కానీ సముచితంగా ఉండాలని అతడికి సూచించారు. కల్కి 2989ఎడి మాస్ కి నచ్చిన సినిమా అసాధారణ వసూళ్లను సాధించింది. డార్లింగ్ అని పిలుపందుకున్న ప్రభాస్ మూవీపై జోకర్ అనే ముద్ర వేస్తారా? ఈ విమర్శలు నిర్మాణాత్మకంగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ప్రభాస్ పై దాడి చేయడం కంటే కెరీర్ పై దృష్టి పెడితేనే మంచిది అని వార్షీకి సూచించారు. భారతీయ సినిమా మరింత అభివృద్ధి వైపు వెళ్లేలా చేయాలంటే ఏం చేయాలో చెబితే బావుంటుందని కూడా సూచించారు.
బాహుబలి సినిమాతో మన సినిమాని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన స్టార్ ప్రభాస్. కల్కి అదే బాటలో ప్రయాణించింది. హాలీవుడ్ కి ధీటుగా భారతీయ సినిమా ఎదిగింది. ఇలాంటి వెక్కిరింపులు మానుకుని చిత్రబృందానికి మద్ధతుగా నిలవాలి. మాకు సర్క్యూట్ (మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లో అర్షద్ వార్సీ పాత్ర) కావాలి... `షార్ట్ సర్క్యూట్ కాదు` అని ఎక్స్ ఖాతాలో అభిషేక్ కౌంటర్ ని పోస్ట్ చేసారు.
ఈ గ్రడ్జ్ ఇంకా చాలా ఉంది:
దక్షిణ భారత సినిమా పాన్ ఇండియాలో అసాధారణ విజయాలను సొంతం చేసుకోవడం కొందరు బాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడకపోవడం ప్రతిసారీ బయటపడుతూనే ఉంది. బాలీవుడ్‌లో కొద్దిమంది మాత్రమే సౌత్ ప్రభావాన్ని నిజంగా అభినందిస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కంటెంట్ పరంగా కానీ, బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా కానీ, సినిమాటిక్ మాస్టర్‌పీస్‌ల ఏకైక సృష్టికర్త తమ పరిశ్రమ మాత్రమేనని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, RRR, కార్తికేయ 2, పుష్ప, కాంతార సహా ఇటీవలి బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD వంటి దక్షిణ భారతీయ చిత్రాల ప్రపంచ విజయాల నేపథ్యంలోను ఇంకా అక్కడ పరిస్థితి మారకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సౌత్ పై నార్త్ గ్రడ్జ్ గురించిన చర్చ మళ్లీ రాజుకుంది. అర్షద్ వార్షీ కల్కి చిత్రంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక.. ప్రభాస్‌ను `జోకర్` అని కూడా పేర్కొన్నాడు. ఇది అవమానకరమైన వ్యాఖ్య. దీనిని బట్టి బాలీవుడ్ లో అర్షద్ వార్షీలా బయటపడటానికి ఇంకా చాలా మంది ఉన్నారని కూడా అర్థమవుతోంది.
`జాలీ ఎల్‌ఎల్‌బి 3`లో కనిపించబోతున్న అర్షద్ వార్సి తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్, ముంజ్యా, కిల్ వంటి బాలీవుడ్ చిత్రాలపై అవిభాజ్య ప్రేమను కురిపించారు. ప్రస్తుతం అతడి పోకడపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.