2024లో `కల్కి 2898 AD` కంటే పెద్ద సినిమా?
కొత్త సంవత్సరంలో అనేక పాన్ ఇండియా సినిమాలు వివిధ పరిశ్రమల నుండి విడుదల కానున్నాయి.
పాన్ఇండియా రేస్ రసకందాయంలో పడింది. ఈ మోజు అంతకంతకు పెరుగుతోంది. బాహుబలి ముందు బాహబలి తర్వాత సీన్ అమాంతం మారింది. ఇటీవల భారతదేశంలోని ముఖ్యమైన భాషల్లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు భారీ బడ్జెట్లు కుమ్మరించి అతి భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు- తమిళం- కన్నడ రంగాల్లో ఈ సన్నివేశం స్పష్ఠంగా కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ చిత్రాల్ని సౌత్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నారు. ఐదు అంతకుమించి భాషల్లో సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 2023 ముగిసి 2024లో అడుగుపెడుతున్నాం. కొత్త సంవత్సరంలో అనేక పాన్ ఇండియా సినిమాలు వివిధ పరిశ్రమల నుండి విడుదల కానున్నాయి. అయితే ఒకదానిని మించి ఒకటి అత్యంత భారీ బడ్జెట్లతో రూపొందిస్తున్న సినిమాల నడుమ ఏ చిత్రం స్థాయి ఎంత? అన్న చర్చా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఒక అంచనా ప్రకారం.. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్, ప్రస్తుతం సెట్లో ఉన్న `కల్కి 2898 AD` కంటే అత్యంత భారీ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాగా సూర్య `కంగువ` గురించి చెప్పుకుంటుండడం ఆసక్తిని కలిగిస్తోంది. కొత్త సంవత్సరంలో పుష్ప 2, ఫైటర్ (బాలీవుడ్) సహా పలు భారీ పాన్ ఇండియా సినిమాలు నాలుగు లేదా ఐదు భాషల్లోకి డబ్ అయి రిలీజయ్యేందుకు అవకాశం ఉంది. జవాన్ - యానిమల్ వంటి బాలీవుడ్ పెద్ద సినిమాలు కేవలం రెండు భాషలలో మాత్రమే డబ్ అయి రిలీజయ్యాయి. కానీ సూర్య `కంగువ` వీటన్నిటి కంటే పెద్ద స్థాయిలో విడుదల కానుంది. సలార్, డంకీ, పఠాన్ లను మించి కంగువ విడుదలలో తగ్గదని చెబుతున్నారు.
కంగువ ఒక పీరియాడికల్ డ్రామా. ఇందులో సూర్య ఆరు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
దరువు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక పెరియో యాక్షన్ చిత్రం. అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా ప్రయత్నంగా చెబుతున్నారు. సూర్య ఆరు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 37 ఇతర భాషల్లోకి డబ్ చేయనున్నారు. ఏ భారతీయ సినిమాకైనా ఇది సరికొత్త రికార్డు అని కూడా ప్రచారం సాగుతోంది.
పెట్టుబడి పరంగా చూస్తే.. కోలీవుడ్ లో రజనీకాంత్ 2.0 నిర్మాణ వ్యయాన్ని మించి కంగువ బడ్జెట్ ఉంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి 2.0 చిత్రం ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన తమిళ చిత్రంగా రికార్డులకెక్కింది. కానీ ఇప్పటికీ 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో `కల్కి 2898 AD` చిత్రం తెరకెక్కుతోందని సమాచారం ఉంది. అయితే సూర్య సినిమాకి ఆ స్థాయి బడ్జెట్ ని కేటాయించారా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కంగువ రిలీజ్ ప్లానింగ్ కల్కి 2898 ఎడిని మించి ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. ఆసక్తికరంగా సూర్య కంగువ హిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా ప్రభాస్ కల్కి పూర్తిగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రక్తి కట్టించే కథాంశంతో రూపొందుతుందన్న సమాచారం ఉంది.
సూర్య `కంగువ` పోస్టర్లు, టీజర్ ఇప్పటికే ఆసక్తిని కలిగించాయి. తుది విడుదల తేదీని ప్రకటించనప్పటికీ `కంగువ` చిత్రాన్ని 2024 ప్రారంభంలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలిసింది. స్టాండర్డ్, 3D , IMAX 3డి ఫార్మాట్‌లలో థియేటర్‌లలో విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది. కంగువలో గదర్ ఫేం బాబీ డియోల్, దిశా పటాని తమిళ అరంగేట్రం చేస్తున్నారు. నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర, K. S. రవికుమార్, అవినాష్ తదితరులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.