స్టార్ హీరో ఫ్యాన్స్ వీరంగం వెనక అసలు కారణం?
స్టార్లు సినీరంగంలో మాత్రమే కొనసాగితే అంతగా ఒత్తిళ్లు ఉండవు. ఒకవేళ రాజకీయ రంగు పులుముకుంటే పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళితేనే అసలు చిక్కు వచ్చి పడుతుంది.
స్టార్లు సినీరంగంలో మాత్రమే కొనసాగితే అంతగా ఒత్తిళ్లు ఉండవు. ఒకవేళ రాజకీయ రంగు పులుముకుంటే పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళితేనే అసలు చిక్కు వచ్చి పడుతుంది. వారి నిత్య జీవితంలో ప్రతిదీ రాజకీయంతో ముడిపెట్టేస్తుంటారు. అంతేకాదు.. దుష్ఠరాజకీయాల్లో స్టార్లను దిగజార్చేందుకు చేయని ప్రయత్నం ఉండదు. అంతకుముందు హీరోలుగా ఓ వెలుగు వెలిగినప్పుడు ఉన్న ఇమేజ్ ని చెరిపేసేందుకు చాలా ప్రయత్నాలు సాగుతాయని చరిత్ర నిరూపించింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రజనీకాంత్, విజయ్ కాంత్, శరత్ కుమార్ .. ఇలా హీరోలు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చాక ఎదురు దెబ్బ తిన్నవారే.
ఇక రాజకీయాల్లో అపార్థాలు కూడా మరో స్థాయిలో ఉంటాయి. ఇటీవల సినిమాలను తగ్గించి రాజకీయాల్లో పూర్తిగా తలమునకలుగా ఉన్న దళపతి విజయ్ విషయంలోను అదే జరుగుతోంది. ఇప్పటికే విజయ్ ని టార్గెట్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు మీడియాలు రకరకాలుగా ప్రచారం చేస్తుండడం బయటపడుతోంది. అతడు అభిమానులతో ఇంటరాక్షన్లు, పొలిటికల్ ఎజెండా గురించి చర్చ సాగిస్తుంటే, వాటిపై బురద జల్లే ప్రయత్నాలు సాగుతున్నాయని తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఇప్పుడు తనతో బీస్ట్ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన సన్ టీవీకి, దళపతి విజయ్ కి మధ్య చిచ్చు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జవాన్ ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకుడు అట్లీ తన కెరీర్ బెస్ట్ హీరో దళపతి విజయ్ గురించి ఎంతో గొప్పగా ఈ వేదికపై మాట్లాడారు. కానీ ఆ విజువల్స్ ఉన్న బిట్‌ని కట్ చేసి ఇతర భాగాన్ని మాత్రమే టెలీకాస్ట్ చేయడంతో సన్ టీవీపై విజయ్ అభిమానులు చిందులు తొక్కుతున్నారు. సన్ టీవీ రాజకీయాలు చేస్తోందని విజయ్ అభిమానులు నానా యాగీ చేస్తున్నారు. సోషల్ మీడియాల్లో ఇప్పుడు ఇది పెద్ద డిబేట్ గా మారింది.
అయితే తమిళ మీడియాలో లైవ్ కార్యక్రమాలు ఏవీ ఉండవు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఫీడ్ ని మాత్రమే మీడియాలన్నిటికీ ఇస్తుంటారు. అలా సన్ టీవీకి ఇచ్చిన వీడియో ఫుటేజ్ లో అట్లీ ప్రశంసా ప్రసంగం ఉందా లేదా? అన్నది ఎవరికీ తెలీదు. కానీ మీడియాలో అపార్థాలు ప్రచారం అయిపోతున్నాయి. విజయ్ పై సన్ టీవీ రాజకీయాలు మొదలెట్టిందని ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.