5 నెలల బిడ్డను కోల్పోయిన హీరోయిన్
'కరోనా ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో తెలిసిందే. అదే సమయంలో నా జీవితంలో ఓ చీకటి రోజు లాంటి ఘటన చోటు చేసుకుంది.
బెంగాలీ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాణీముఖర్జీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిందీ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. అటుపై ఆదిత్య చోప్రాని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. తనకన్నా వయసులో వ్యత్యాసం భారీగా ఉన్నా రాణీ ప్రేమకి వయసు అడ్డంకిగా మారలేదు. మనసులు కలిసిన తర్వాత వయసుతో పనేంటి అని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
ఆ తర్వాత వృత్తిగత జీవితంలోనూ కొనసాగింది. ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తోంది. అయితే వివాహం తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ఎక్కడా విమర్శలకు తావు ఇవ్వకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ డీసెంట్ పాత్రలు పోషిస్తూ జర్నీ సాగిస్తుంది. తాజాగా రాణీముఖర్జీ తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటన గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయింది.
మెల్ బోర్న్ ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్ వేదికగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'కరోనా ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో తెలిసిందే. అదే సమయంలో నా జీవితంలో ఓ చీకటి రోజు లాంటి ఘటన చోటు చేసుకుంది. 2020 లో రెండవసారి గర్భం దాల్చాను. అప్పటికే ఐదు నెలలు నిండాయి. మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డ పుడుతుందని ఎంతో ఆశతో ఉన్నాను. ఆ బిడ్డపై ఎన్నో ఆశలు..కలలు కన్నాను.
కానీ అవన్నీ రాత్రికి రాత్రే ఆవిరైపోయాయి. ఐదు నెలలకే కడుపులో బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్దం కాలేదు. నా కెలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. మొదటి కాన్పులోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. బిడ్డ చనిపోయిన విషయం మాత్రం బయట ఎవరికీ తెలియదు. నా కుటుంబం..నాకు తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పదలుచుకోలేదు. ఇతరులను కూడా బాధపెట్టిన వాళ్లం అవుతాం అనే కారణంగా ఎక్కడా చెప్పలేదు' అని అంది.