కలకత్తా టూ చెన్నై ఆ లెజెండరీ దర్శకుడి జర్నీ అలా!
తెలుగు సినిమా కీర్తి ఆదుర్తి సుబ్బారావు అద్భుతాల గురించి చెప్పాల్సిన పనిలేదు.
తెలుగు సినిమా కీర్తి ఆదుర్తి సుబ్బారావు అద్భుతాల గురించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఆయనో లెజెండ్. వెండి తెరపై ఎన్నో వైవిథ్యమైన చిత్రాలు ఆవిష్కరించిన గొప్ప దర్శకులు. అమరసందేశం నుంచి మహాకవి క్షేత్రయ్య వరకూ ఎన్నో గొప్ప చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ముఖ్యంగా కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఆదుర్తి తెరకెక్కించి కళాఖండాలు అన్నీ ఇన్ని కావు. అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న చిత్రాలవి.
మూడు దశాబ్ధాల పాటు తెలుగు పరిశ్రమకు ఆయనందించిన సేవలు చిరస్మరణీయం. ఆదుర్తి తర్వాత ఆయన వారసత్వం నుంచి ఇండస్ట్రీ కి ఎవరూ రాలేదు. తాజాగా ఆయన కుమారుడు సాయిభాస్కర్ ఆదుర్తి ఇండస్ట్రీ కష్టాల గురించి వివరించే ప్రయత్నం చేసారు. ఆవెంటే ఆయన మాటల్లోనే..` మా నాన్నగారి వాళ్లది రాజమండ్రి దగ్గర చిన్న పల్లెటూరు. సినిమాల పట్ల గల ఆసక్తితో ఆయన ఇంట్లో చెప్పకుండా కలకత్తా వెళ్లిపోయారు.
ఆ తరువాత ఇండస్ట్రీలో అనేక మంది దగ్గర పనిచేసిన అనుభవంతో ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ మధ్యలో పడాల్సిన అన్ని కష్టాలు పడ్డారు. సినిమా కష్టాలు ఆయన కూడా చూసిన వారే. దర్శకుడిగా అయన చేసిన మొదటి సినిమా `అమర సందేశం` ఫ్లాప్ అయింది. అయినా అక్కినేని సిఫార్స్ కారణంగా అన్నపూర్ణ బ్యానర్లో అవకాశం దక్కింది. అక్కడ నుంచి అన్నపూర్ణ బ్యానర్లో వరుస విజయాలను అందుకున్నారు.
అడపా దడపా హిందీ సినిమాలకి దర్శకత్వ వహించారు. మలయాళంలోని `అగ్నిపుత్రి` సినిమాను ఆయన హిందీలో `దర్పణ్` అనే పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమాకి ఆయనే నిర్మాత. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో, అప్పటి వరకూ సంపాదించినదంతా పోయింది. `మాయదారి మల్లిగాడు` సినిమా నుంచి మళ్లీ ఆయన కోలుకున్నారు.