ఆ హీరో క్లైమాక్స్.. అంత పెడితే తిరిగి వస్తాయా?
హీరో రేంజును బట్టి బడ్జెట్.. కానీ అలా కాకుండా గుడ్డిగా పెట్టుబడి పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో గతానుభవాలు స్పష్ఠం చేసాయి.
హీరో రేంజును బట్టి బడ్జెట్.. కానీ అలా కాకుండా గుడ్డిగా పెట్టుబడి పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో గతానుభవాలు స్పష్ఠం చేసాయి. స్టార్ హీరోల సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా ట్రేడ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పంపిణీ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇటీవల ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్టార్ల రెమ్యునరేషన్ గొంతెమ్మ కోర్కెల కారణంగా నిర్మాతకు అదనపు బడ్జెట్ ఎలా ఖర్చవుతోందో వర్ణించి చెబుతున్నారు. అతడు ఈ విధానాన్ని పూర్తిగా తప్పు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక స్టార్ హీరో సినిమాకి అదుపు తప్పిన ఖర్చు గురించి నెటిజనుల్లో డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు ఉన్న అజయ్ దేవగన్ సినిమాపై పెడుతున్న బడ్జెట్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ లో భారీ చిత్రాల్లో నటించిన హీరోగా అజయ్ దేవగన్ కి గుర్తింపు ఉంది. అయితే అతడి కంటూ ఒక మార్కెట్ పరిధి ఉంది. దానిని మించి బడ్జెట్లు పెడితే అది తిరిగి రాబట్టడమెలా? ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సింగం ఎగైన్ కోసం నిర్మాతలు వెదజల్లుతున్న భారీ పెట్టుబడులు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయన్న చర్చ సాగుతోంది. ఈ సినిమాని రోహిత్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన కూడా నిర్మాతల్లో ఒకరు. అయితే ఈ యాక్షన్ చిత్రం కోసం దాదాపు 250 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని, కేవలం క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసమే దాదాపు 25 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. భారతీయ సినిమా హిస్టరీలో ఖరీదైన క్లైమాక్స్ సీన్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని కూడా చెబుతున్నారు.
సింగం ఎగైన్ ఒక కాప్ డ్రామా. భారీ ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో రక్తి కట్టించనుందని టీమ్ చెబుతోంది. అయితే దేవగన్ పై ఫైట్ సీన్ కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేస్తుండడం విస్మయపరుస్తోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కే ఇంత ఖర్చు చేయడం.. ఓవరాల్ గా 250 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే మరో బాహుబలి సినిమాకి పెట్టినంత పెట్టుబడి పెడుతున్నట్టే. అయితే సింగం ఎగైన్ అంత పెద్ద విజయం సాధిస్తుందా? అజయ్ దేవగన్ ని చూసి రిపీటెడ్ గా మాస్ ఆడియెన్ థియేటర్లకు వస్తారా? అంటూ విశ్లేషణ సాగుతోంది. రోహిత్ శెట్టి కాప్ విశ్వాన్ని అద్భుతంగా తెరకెక్కించగలరు. కానీ పరిస్థితులు దేవగన్- శెట్టి టీమ్ కి అనుకూలంగా ఉన్నాయా? అన్నదానిపైనే చర్చ సాగుతోంది.
ఈ సంవత్సరం దీపావళికి బిగ్గెస్ట్ క్లాష్ ఎదురు కానుంది. దీపావళికి బాలీవుడ్ లో రెండు సీక్వెల్‌లు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇందులో `సింగం ఎగైన్` రోహిత్ శెట్టి -అజయ్ దేవగన్‌ల సింగం సిరీస్‌లో మూడవ చిత్రం కాగా, కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 3 భారీ క్రేజుతో పోటీ బరిలో నిలవనుంది. కాంపిటీషన్ దృష్ట్యా సింగం ఎగైన్ బాక్సాఫీస్ వద్ద ఏవిధంగా రాణిస్తుందో వేచి చూడాలి. సింగం 3లో అజయ్ దేవగన్ తన పాత్రను పునరావృతం చేయనుండగా, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్‌లతో పాటు అతడి తోటి స్క్రీన్ కాప్స్ రణ్‌వీర్ సింగ్ , అక్షయ్ కుమార్ అతిథులుగా కనిపించనున్నారు. ఇందులో అర్జున్ కపూర్ విలన్‌గా కనిపించనున్నారు. కాప్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నందున బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అన్న టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.