3రోజుల్లో 50 కోట్లు.. అతడే రీమేక్ కింగ్!
ఆసక్తికరంగా దృశ్యం 2 రీమేక్ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అజయ్ దేవగన్ ఇప్పుడు గుజరాతీ చిత్రం వాష్ హిందీ రీమేక్ తో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
పెద్ద తెర.. బుల్లితెర లేదా ఓటీటీ.. వేదిక ఏదైనా మంచి కంటెంట్ కి ఆదరణ దక్కుతుందని ప్రూవ్ అవుతోంది. ఇదే కోవకు చెందుతుంది అజయ్ దేవగన్- ఆర్ మాధవన్ నటించిన షైతాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సందడి చేస్తోంది. టికెట్ విండోలో రెండంకెల ప్రారంభం తర్వాత మొదటి శనివారం షైతాన్ ఆదాయం పెరిగింది. 2వ రోజున హారర్ థ్రిల్లర్ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.18.75 కోట్లు వసూలు చేసిందని సాక్‌నిల్క్ తెలిపింది. దీనితో షైతాన్ మొత్తం కలెక్షన్ ఇప్పుడు రూ.33.5 కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ చిత్రం 2వ రోజు హిందీ ఆక్యుపెన్సీ పెరుగుదలను నమోదు చేసింది. ఇది మొదటి రోజు 25.70 శాతంతో పోలిస్తే 33.65 శాతానికి పెరిగింది. వికాష్ బాల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన గుజరాతీ చిత్రం 'వాష్'కి ఇది హిందీ రీమేక్.
ఈ చిత్రం కథాంశం మంచి - చెడుల మధ్య యుద్ధం నేపథ్యంలో తిరుగుతుంది. ఒక కుటుంబం తమ ఆడపిల్లను షైతాన్ భారి నుంచి రక్షించుకోవడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుంది. ఆర్ మాధవన్ దెయ్యం పాత్రలో నటించగా, అజయ్ దేవగన్ - జ్యోతిక దంపతుల పాత్రలను పోషించారు. మాధవన్ -జ్యోతిక గతంలో 2001 తమిళ చిత్రం దమ్ దమ్ దమ్ లో కలిసి నటించారు. ఈసారి జ్యోతికకు విలన్ గా మాధవన్ నటించారు. మార్చి 7న షైతాన్ విడుదల కాగా ఈ వీకెండ్ లోనే 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషిస్తోంది. పరిమిత కాస్టింగ్ పరిమిత బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం లైఫ్ లైమ్ లో 100 కోట్ల నెట్ వసూలు చేస్తుందని అంచనా.
రీమేక్‌లలో దేవగన్ హవా:
ఆసక్తికరంగా దృశ్యం 2 రీమేక్ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అజయ్ దేవగన్ ఇప్పుడు గుజరాతీ చిత్రం వాష్ హిందీ రీమేక్ తో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దేవగన్ సైలెంట్ గా పెద్ద విజయాలను అందుకుంటున్నాడు. అతడు ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ తో దక్షిణాదినా మెరిసాడు. ఉత్తరాది దక్షిణాదిన గడిచిన రెండేళ్లుగా రీమేక్ లు భారీ ఫ్లాప్‌లు గా మిగులుతున్నాయి. కానీ దేవగన్ దీనిని అధిగమించి రీమేక్ ల కింగ్ అని నిరూపిస్తున్నాడు.