అఖండ 2: బోయపాటి అమెరికా ప్లాన్..

ఈ సినిమాలోని యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని బోయపాటి చిత్రీకరించబోతున్నారంట. ఈ సీన్ తోనే మూవీ షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Update: 2024-10-29 08:30 GMT

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని ఈ సినిమా వసూళ్లు చేసింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం బోయపాటి, బాలయ్య 'అఖండ 2' సినిమాని స్టార్ట్ చేశారు. 'అఖండ' కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.

బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట తో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపొయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా బోయపాటి శ్రీను పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య అఘోర పాత్రతో పాటు రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ సీక్వెల్ లో ఉంది. ఆమె మొదటి సినిమాలో చేసిన కలెక్టర్ రోల్ లోనే సీక్వెల్ లో కూడా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే 'అఖండ 2' మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలోని యూఎస్ బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని బోయపాటి చిత్రీకరించబోతున్నారంట. ఈ సీన్ తోనే మూవీ షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ప్రగ్యా జైస్వాల్ ని ఓ ప్రమాదం నుంచి కాపాడేందుకు బాలకృష్ణ చాలా పెద్ద రెస్క్యూ చేస్తాడంట. ఈ పోరాట ఘట్టం చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

స్టైలిష్ లుక్ లో బైక్ పైన బాలకృష్ణ డ్రమాటిక్ గా ఎంట్రీ ఇచ్చి ఈ ఫైట్ చేస్తాడంట. అయితే ఈ సీన్ ఇంట్రడక్షన్ అఘోర పాత్రకి సంబందించినది కాకపోవచ్చని అనుకుంటున్నారు. 'అఖండ' లో రైతు క్యారెక్టర్ లో ఉన్న బాలయ్య ఇంట్రడక్షన్ ని వ్యవసాయ భూమి, ఎద్దుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీక్వెన్స్ తో ప్లాన్ చేశారు. దానికి విరుద్ధంగా 'అఖండ 2' లో స్టైలిష్ అవతార్ లో బాలయ్యని బోయపాటి పరిచయం చేయనున్నాడనే ప్రచారం నడుస్తోంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. 'అఖండ' మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో 'అఖండ 2' పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటే బాలయ్య మార్కెట్, బ్రాండ్ వేల్యూ కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    

Similar News