యువతరం హీరోల్లో అఖిల్ అక్కినేని హార్డ్ వర్క్, డెడికేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. తాను ఎంపిక చేసుకున్న పాత్ర కోసం చాలా శ్రమించడం ఈ యువహీరో ప్రత్యేకత. కానీ దురదృష్టవశాత్తూ అతడి ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు. తన చివరి చిత్రం `ఏజెంట్` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇది అతడిని తీవ్రంగా నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు అతడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఇలాంటి సమయంలో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా మార్చి రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మార్చి మొదటి వారంలో చిన్నపాటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. KGF -సలార్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
అఖిల్ కోసం అన్నపూర్ణ బ్యానర్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సహా పలు బ్యానర్లు మంచి అవకాశాల్ని కల్పించాయి. కానీ విజయాలు దక్కలేదు. గీతా ఆర్ట్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫర్వాలేదనిపించింది. కానీ ఏజెంట్ పరాజయం తీవ్ర నిరాశను కలిగించింది. అఖిల్ కెరీర్‌ని సరిగ్గా సెట్ చేయడానికి UV క్రియేషన్స్ పెద్ద ప్రణాళికల్లో ఉంది. అక్కినేని అభిమానులు వేచి చూస్తున్న ఒక గొప్ప విజయం అఖిల్ కి అందిస్తారనే భావిస్తున్నారు. ఏం జరగనుందో వేచి చూడాలి.