నేను చాలా నార్మల్ మనిషినంటున్న ఐకాన్ స్టార్
ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత బన్నీకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్, పుష్ప2 తర్వాత మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
హాలీవుడ్ లో బాగా పేరున్న మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో మన దేశంలో కూడా తమ మ్యాగజైన్ ను లాంచ్ చేస్తున్నారు. దాని ఫస్ట్ కాపీ కవర్ పేజ్ అల్లు అర్జున్ ఫోటోతో రావడం ఇప్పుడు విశేషంగా మారింది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా, అందులో బన్నీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నటుడిగా మంచి క్రేజ్, గుర్తింపు అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పాడు అల్లు అర్జున్. బలం, ఆత్మ విశ్వాసం ఎప్పుడూ మన మనసులోనే ఉంటాయని, వాటినెవరూ తీసేయలేరని, అవి పుట్టుకతో వచ్చిన లక్షణాలని అవెప్పుడూ తనతోనే ఉంటాయన్నాడు.
సక్సెస్ అయ్యాక కూడా వినయంగా ఉండటం ఎంతో ముఖ్యమని, లైఫ్ లో సక్సెస్ అయ్యాక కూడా గర్వం లేకుండా ఉండే చాలా మందిని చూశానని బన్నీ చెప్పాడు. పుష్ప2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ వచ్చిన బన్నీ తాను ఇప్పటికీ ఓ సామాన్యుడినే అని చెప్తున్నాడు. ఏదైనా మూవీ చూస్తున్నంత సేపు కూడా తాను ఓ సాధారణ వ్యక్తిగానే ఆ సినిమాను చూస్తానని చెప్పుకొచ్చాడు బన్నీ.
అయితే షూటింగ్స్ లేనప్పుడు ఐకాన్ స్టార్ ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటాడట. కొన్నిసార్లు కనీసం పుస్తకాలు కూడా చదవనని, అలా ఏమీ చేయకుండా ఖాళీగా ఉండటమంటే తనకెంతో ఇష్టమని తెలిపాడు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే బన్నీ ఫోటో ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజ్ పై రావడం చూసి తన ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.