ఆ ఛానల్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై ఇటీవల అల్లు అర్జున్ అభిమానులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

Update: 2024-11-11 08:51 GMT

హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి కొన్ని థంబ్నెయిల్స్ తో వీడియోలు విడుదల చేయడం అని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన రచ్చ మొదలైంది.

ఒక వీడియో థంబ్నెయిల్‌లో ‘చావు, బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న అల్లు అర్జున్’ అనే విధంగా కనిపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గతంలోనే ఈ విషయంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హీరోను కించపరిస్తే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆఫీస్ లోకి వెళ్లి దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే సందర్భంలో అల్లు అర్జున్ పై నిరాధార ఆరోపణలతో వీడియోలు రావడం, అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ తరహా సంఘటనలు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇక పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. సినిమా టీమ్ పలు ప్రమోషన్ కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. పాట్నా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి పలు ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్లతో ప్రచారం చేపట్టేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. పుష్ప 2 మూవీ గురించి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.

ఈ సినిమా విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు నెలకొల్పుతూ ఉంది. ముఖ్యంగా యూఎస్ లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ పై చేసిన దుష్ప్రచారం ఈ సినిమా ప్రమోషన్ పై కూడా ప్రభావం చూపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News