విశాఖలో ఫ్యాన్స్ మెగా హీరోలకు ఘనస్వాగతం
ఇప్పుడు మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ లో పలువురు విశాఖ షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
బీచ్ సొగసుల విశాఖనగరం, ఆ చుట్టు పక్కల పరిసరాల్లో షూటింగులు చేసేందుకు దర్శకనిర్మాతలు, హీరోలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. విశాఖ నగరం నుంచి ఆంధ్రా ఊటీ అరకు వరకూ అందమైన ఎగ్జోటిక్ లొకేషన్లు, అరకులో చల్లని వాతావరణం ఈ వేసవిలో చిత్రీకరణలకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో సీఎం జగన్ ఫోకస్ విశాఖనగరంపై ఉండడంతో వందల కోట్ల వ్యయంతో విశాఖ బీచ్‌లు, నగరంలో కూడళ్లకు కొత్త సొబగులు అద్దారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర బ్యూటిఫికేషన్ పై దృష్టి సారించింది. బీచ్ రోడ్ లను విశాలంగా తీర్చిదిద్ది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ప్రత్యేక శ్రద్ధ చూపెడుతుండడంతో ఇప్పుడు టూరిస్టుల రద్దీ కూడా పెరుగుతోంది.
ఇప్పుడు మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ లో పలువురు విశాఖ షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వీళ్లతో పాటు పలు పొరుగు భాషా చిత్రాల షూటింగులు విశాఖ పరిసరాల్లో జరుగుతున్నాయి. ఇటీవల విశాఖ పరిసరాల్లో సినిమాల షూటింగులు పెరుగుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకుముందే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా పుష్ప 2 చిత్రీకరణ కోసం విశాఖ నగరంలో అడుగుపెట్టారు. అతడు వస్తున్న విషయం తెలుసుకుని భారీ ఎత్తున అభిమానులు విశాఖ విమానాశ్రయంలో గుమిగూడారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. బన్ని విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఫ్యాన్స్ అందరూ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. వైజాగ్ విమానాశ్రయం నుండి హోటల్ వరకు అల్లు అర్జున్‌ను అభిమానులు అనుసరించారు. వారం పాటు విశాఖ పరిసరాల్లో బన్ని చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. పుష్ప 2 చిత్రం 15 ఆగస్ట్ 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా ఈ నెలాఖరు వరకూ విశాఖలో జరుగుతుందని తెలిసింది. చరణ్, శంకర్ బృందం విశాఖకు చేరుకునేందుకు ప్లాన్ రెడీ చేసారని తెలుస్తోంది. ఇప్పటికే నగర పరిసరాల్లో కొన్ని తమిళం, హిందీ చిత్రాలు సహా ఒడియా, భోజ్ పురి సినిమాల చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి.