అంబానీ పెళ్లి క‌వ‌రేజీ.. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ రెమ్యున‌రేష‌న్?

అంటే దానికోసం స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఆయ‌న ఏ రేంజులో నోట్లు విసురుతారో అంచ‌నా వేయ‌గ‌లం.

Update: 2024-07-08 15:30 GMT

సామాన్యుల పెళ్లిళ్లు, ఇత‌ర గ్లామ‌ర‌స్ వేడుక‌ల కోసం ఫోటోగ్రాఫ‌ర్లు పెద్ద మొత్తాల్ని వ‌సూలు చేస్తుంటారు. జీవితాంతం గుర్తుండిపోయే మెమ‌రీస్ ని క్యాప్చుర్ చేసేందుకు ఫోటోగ్రాఫ‌ర్ల కోసం ఖ‌ర్చు చేసేందుకు కుటుంబాలు వెన‌కాడ‌ని రోజులివి. అలాంటిది సెల‌బ్రిటీ వెడ్డింగుల‌కు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల రెవెన్యూ ఏ రేంజులో ఉంటుందో ఊహించ‌గ‌లం. వెడ్డింగ్ బిజినెస్ ల‌క్ష‌లు దాటి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తింది. ఇందులో ఫోటోగ్ర‌ఫీ బ‌డ్జెట్లు చుక్క‌ల్లో ఉన్నాయి. అందునా ఆసియ‌న్ రిచెస్ట్ బిజినెస్ మేన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి జ‌రుగుతోంది? అంటే దానికోసం స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఆయ‌న ఏ రేంజులో నోట్లు విసురుతారో అంచ‌నా వేయ‌గ‌లం.

ఇటీవ‌ల ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు, అనంత్ అంబానీ తన ప్రియురాలు రాధికా మర్చంట్‌ను 12 జూలై 2024న వివాహం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సంగీత్ స‌హా పెళ్లికి ముందు వేడుక‌లతో ముంబై జియో సెంట‌ర్ సంద‌డిగా ఉంది. దానికి ముందు ఈ జంట రెండు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలతో విలాసవంత‌మైన సెల‌బ్రేష‌న్ ని చూసాం. వీటిలో ఒకటి జామ్‌నగర్‌లో జరిగింది. మరొకటి ఇటలీలో క్రూయిజ్ వేడుక. ఇక అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ల‌ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ప‌ని చేసిన ఫోటోగ్రాఫ‌ర్ రాధిక్ జోసెఫ్‌కి ఎంత చెల్లించారో తెలిస్తే షాక్ కి గుర‌వ్వాల్సిందే.

అనంత్ అంబానీ -రాధికల మర్చంట్ క్రూయిజ్ పార్టీ అధికారిక ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గ‌తంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా , KL రాహుల్- ఆథియా జంట‌ల పెళ్లి వేడుక‌ల‌కు ఫోటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేసారు. ఆయ‌న వారి పెళ్లి వేడుక‌ల‌ను ఎంతో అందంగా క్యాప్చుర్ చేసారు.

జోసెఫ్ రాధిక్ ఒక రోజుకు భారీ మొత్తంలో వ‌సూలు చేస్తున్నాడు. రూ. 1,25,000 నుండి అత‌డికి ఒక రోజు ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప‌న్ను అద‌నం. పెళ్లి వేడుక ఆద్యంతం క‌వ‌ర్ చేస్తూ ఫోటోలు వీడియోలను అత‌డు అందిస్తాడు. అలాగే ప్రయాణానికి, వివాహ వేదిక వద్ద బస చేయడానికి రాధిక్ అదనంగా వసూలు చేస్తాడు. అత‌డు అనంత్ - రాధికల క్రూయిజ్ పార్టీని డాక్యుమెంట్ చేయడానికి ఓవ‌రాల్ గా మూడు రోజుల కోసం రుసుము దాదాపు రూ. 6,00,000 వ‌సూలు చేసాడ‌ని తెలిసింది.

జోసెఫ్ రాధిక్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన‌ త‌ర్వాత‌ మేనేజ్‌మెంట్ విద్య‌ను అభ్య‌సించాడు. ఆపై మూడేళ్లపాటు కార్పొరేట్‌లో కూడా పనిచేశాడు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం... అత‌డి నేప‌థ్యం గురించి తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేం. అత‌డు ఇప్పుడు ప్ర‌ముఖ‌ ఫోటోగ్రాఫర్ కావొచ్చు కానీ ఒక‌ప్పుడు ఉపాధి కోసం టూత్‌పేస్ట్ లు విక్రయించడానికి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేవాడు. తరువాత నెమ్మ‌దిగా తాను ఎంత‌గానో ప్రేమించే ఫోటోగ్రఫీలో ఉపాధిని కనుగొన్నాడు. 2010లో జోసెఫ్ రాధిక్ తన అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఫోటోగ్రఫీలో తన అభిరుచిని వృత్తిగా మార్చుకున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో ఏ సెల‌బ్రిటీ వెడ్డింగ్ జ‌రిగినా రాధిక్ తొలి ప్ర‌యారిటీ. అత‌డి అపాయింట్ మెంట్ దొర‌క‌డం కూడా పెళ్లిళ్ల సీజ‌న్ లో చాలా క‌ష్ట‌మ‌ని కూడా ముచ్చ‌టించుకుంటారు.

అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల‌ రెండు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ల‌ మొత్తం బడ్జెట్ రూ. 1200 కోట్లు. అంత‌ర్జాతీయ గాయ‌ని రిహన్నా, అరిజిత్ సింగ్ , శ్రేయా ఘోషల్ స‌హా ఎంద‌రో ఈవెంట్ లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. అంబానీ ఇంటి పెళ్లి వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి ఈ గాయకులకు కోట్లలో చెల్లించినట్లు సమాచారం.

Tags:    

Similar News