2025 ఆస్కార్ బరిలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్.. ఏదంటే?
ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా.. 2025 ఆస్కార్ కు గాను భారత్ నుంచి లాపతా లేడీస్ సినిమా ఎంపికైంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకునేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది 96వ ఆస్కార్ వేడుక గ్రాండ్ గా జరగ్గా.. ఇప్పుడు 97వ పురస్కార ప్రదానోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా.. 2025 ఆస్కార్ కు గాను భారత్ నుంచి లాపతా లేడీస్ సినిమా ఎంపికైంది.
తాజాగా 2025 ఆస్కార్ కు ఇండియన్ షార్ట్ ఫిల్మ్ 'సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అర్హత సాధించింది. చిదానంద నాయక్ తెరకెక్కించిన ఆ లఘ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచిందని తాజాగా నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. లైవ్ యాక్షన్ కేటగిరీలో అర్హత సాధించినట్లు వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.
అయితే 16 నిమిషాల డ్యురేషన్ తో సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ ను కన్నడ జానపద కథ ఆధారం రూపొందించారు. ఓ వృద్ధురాలి, కోడికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించగా, దానికి కనిపెట్టడం కోసం ఆమె పడే తపన ను చక్కగా చూపించారు. ఎమోషనల్ రైడ్ గా సాగే ఆ షార్ట్ ఫిల్మ్.. ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది.
ఇటీవల కేన్స్-2024లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును కూడా దక్కించుకుంది. హాలీవుడ్ షార్ట్స్ ఫిల్మ్స్ తో పోటీ పడి మరీ మొదటి బహుమతిని గెలుచుకుంది. వివిధ భాషలకు చెందిన మొత్తం 17 షార్ట్స్ ఫిల్స్ కేన్-2024 బరిలో నిలవగా.. వాటన్నింటిని వెనక్కి నెట్టి అవార్డును సొంతం చేసుకుంది. బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బహుమతి గెలుచుకుంది. ఇప్పుడు ఆస్కార్ ను కూడా తీసుకొస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పటికే భారత్ నుంచి ఎంపికైన లాపతా లేడీస్ సినిమా కూడా ఆస్కార్ అవార్డు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన ఘటన ఆధారంగా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించారు. రిచ్ వాల్యూస్ తో ఆమిర్ ఖాన్ నిర్మించారు. మరి లాపతా లేడీస్, సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో ఏం చేస్తాయో చూడాలి.