కాస్టింగ్‌ కౌచ్‌పై తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమంటూ గతంలో అనేకమంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు.

Update: 2024-10-19 07:44 GMT

సినీ ఇండస్ట్రీని 'క్యాస్టింగ్ కౌచ్' పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమంటూ గతంలో అనేకమంది హీరోయిన్లు బహిరంగంగానే చెప్పారు. సినిమా అవకాశాలు ఇవ్వాలంటే కొందరు కమిట్‌మెంట్స్ అడుగుతారని తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. అలాంటి వేధింపులు అన్ని ఇండస్ట్రీలలో ఉంటాయని, కానీ ఒక్క చిత్ర పరిశ్రమకే పరిమితం అనేలా చూడటం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల తనదైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చింది. తానెప్పుడూ అలాంటివి ఎదుర్కోలేదని, ఇదంతా బుల్ షిట్ ప్రచారమంటూ కొట్టిపారేసింది.

‘పొట్టేల్‌’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా అడిగే ప్రశ్నలకు అనన్య నాగళ్ళ సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ‘‘సినిమాల్లో ఒక హీరోయిన్ లేదా ఆర్టిస్ట్ కి ఫస్ ఛాన్స్‌ ఇచ్చే ముందు కమిట్‌మెంట్‌ అడుగుతుంటారు. వేరే ఇండస్ట్రీలలో అలా ఉండదు. మీరెప్పుడైనా ఇది ఫేస్‌ చేశారా?’’ అని ఓ జర్నలిస్టు అడిగారు. దీనికి అనన్య స్పందిస్తూ ‘‘అలా అడుగుతారని మీరెలా అంత కచ్చితంగా చెబుతున్నారు. అదంతా అవాస్తవం. మీరు అనుకునేది 100 శాతం తప్పు. నిజంగా ఇప్పటివరకు నేను అలాంటివి ఫేస్ చెయ్యలేదు. సీరియస్ గా నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు’’ అని బదులిచ్చింది.

''ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండొచ్చు. ఎక్కడైనా 50 శాతం పాజిటివ్, మరో 50 శాతం నెగెటివ్ ఉంటుంది. అందరూ ఆ నెగెటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నారు. అంతేకానీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చేముందే కచ్చితంగా కమిట్ మెంట్ ఉంటుందనేది బుల్ షిట్'' అని అనన్య నాగళ్ళ గట్టిగా చెప్పింది. ‘కమిట్మెంట్ ఇస్తే ఒక రెమ్యునరేషన్, ఇవ్వకపోతే తక్కువ రెమ్యునరేషన్ ఉంటుందని ఇండస్ట్రీలో అనుకుంటారు’ అని సదరు విలేకరి మరో ప్రశ్న వేయగా.. ''లేదు.. మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా విన్న మాటలనే చెబుతున్నారు. కానీ ఎక్స్ పీరియన్స్ చేసిన దాన్ని నేనే చెప్తున్నాను. మీరు అనుకున్నట్లు ఇక్కడ అలా లేదు'' అని సమాధానమిచ్చింది.

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై అప్పట్లో 'మీటూ' ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది స్టార్ హీరోయిన్లు తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గురించి బహిరంగంగా వెల్లడించారు. చిన్మయి శ్రీపాద లాంటి సెలబ్రిటీలు ఇప్పటికీ ఆ అంశంపై గళం విప్పుతూనే ఉన్నారు. మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూశాం. మాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపుల వివాదం నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌(AMMA) అధ్యక్ష పదవికి మోహన్‌ లాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. రీసెంట్ గా జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Tags:    

Similar News