నెగెటివిటీకి సక్సెస్‌తోనే సమాధానం

టాలీవుడ్లో ఫెయిల్యూర్ లేకుండా సాగిపోతున్న దర్శకుడు ఎవరు అంటే అందరూ రాజమౌళి పేరే చెబుతారు.

Update: 2025-01-18 00:30 GMT

టాలీవుడ్లో ఫెయిల్యూర్ లేకుండా సాగిపోతున్న దర్శకుడు ఎవరు అంటే అందరూ రాజమౌళి పేరే చెబుతారు. కానీ రాజమౌళిలా భారీ చిత్రాలు తీయకపోయినా, అద్భుతాలను ఆవిష్కరించకపోయినా.. అపజయం అంటూ లేకుండా సాగిపోతున్న దర్శకుడు ఇంకొకరు ఉన్న సంగతి అందరూ మరిచిపోతారు. ఆ దర్శకుడే.. అనిల్ రావిపూడి. తొలి సినిమా ‘పటాస్’తో మొదలుపెట్టి.. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-3, భగవంత్ కేసరి.. ఇలా ఇప్పటిదాకా అతను చేసిన ప్రతి సినిమా హిట్టే. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు అనిల్. మొత్తం తన ఫిల్మోగ్రఫీలో ఓ మోస్తరు సక్సెస్‌తో సరిపెట్టుకున్న సినిమా అంటే.. ‘ఎఫ్-3’ మాత్రమే. మిగతావన్నీ ఘనవిజయాన్నందుకున్నాయి. ఐతే ఇలాంటి సక్సెస్ రేట్‌తో సాగుతున్నా సరే.. అనిల్ మీద సోషల్ మీడియాలో నెగెటివిటీ తక్కువేమీ కాదు.

కామెడీ పేరుతో క్రింజ్ సీన్లు తీస్తాడని.. తన కథల్లో కొత్తదనం ఉండదని.. లాజిక్ అస్సలు పట్టించుకోడని.. కామెడీతో పాటు అన్ని సన్నివేశాలూ ఓవర్ ద టాప్ ఉంటాయని అతణ్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు నెటిజన్లు. అనిల్ సినిమా రిలీజవ్వడం ఆలస్యం.. క్రింజ్ క్రింజ్ అంటూ అతడి మీద పడిపోతుంటుంది ఒక వర్గం. జబర్దస్త్ కామెడీని వెండి తెరకు తీసుకొచ్చాడంటూ అతణ్ని ఎగతాళి చేసేలా కామెంట్లు చేస్తుంటారు. ఐతే అనిల్ మరీ అంత నెగెటివిటీ చూపించాల్సిన దర్శకుడా అన్నది ప్రశ్న. ఈ రోజుల్లో కామెడీ రాసే, తీసేవాళ్లు కరవైపోయారు. కామెడీ సినిమాలు రోజు రోజుకూ తగ్గిపోతున్న టైంలో ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అతను సినిమాలు తీస్తున్నాడు. వాటికి ఆదరణా దక్కుతోంది. తన కథలు రొటీన్‌గా ఉంటాయి, లాజిక్ గురించి పట్టించుకోడు అన్నది వాస్తవమే. కానీ కామెడీ సినిమాల్లో లెజెండరీ స్టేటస్ అందుకున్న ఈవీవీ సత్యనారాయణ సైతం ఇలాంటి సినిమాలే తీసేవారు మరి. ఏం తీసినా.. ఎలా తీసినా.. అనిల్ సినిమాలను ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి మరువరాదు. ప్రేక్షకులు తన సినిమాలను అంతగా ఆదరిస్తున్నపుడు.. సోషల్ మీడియా మేధావుల గురించి పట్టించుకోవాల్సిన పని లేదన్నది అనిల్ మద్దతుదారుల మాట. తనేం తీస్తున్నాడో ఫుల్ క్లారిటీతో తీస్తున్నాడు కాబట్టి.. అనిల్ మీద ఇంత నెగెటివిటీ చూపించాల్సిన అవసరం కూడా లేదన్నది అతడి వ్యతిరేకులు అర్థం చేసుకోవాల్సిన విషయం.

Tags:    

Similar News