'ఎఫ్ 2' రేంజ్ లో నవ్విస్తారా?
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''సంక్రాంతికి వస్తున్నాం''.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. 'పటాస్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్.. యాక్షన్ కు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ, అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు. అయితే 'ఎఫ్ 2' తర్వాత ఆ రేంజ్ లో నవ్వించిన సినిమా అనిల్ నుంచి రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో దర్శకుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''సంక్రాంతికి వస్తున్నాం''. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో, అందరిలో ఆసక్తి నెలకొంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని రూపొందిస్తున్న సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే చిత్రం అవుతుందని, అనిల్ మరోసారి తన మార్క్ కామెడీతో నవ్విస్తారని అభిమానులు భావిస్తున్నారు.
వెంకీ - అనిల్ కలిసి చేసిన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫస్ట్రెషన్' సినిమా 2019 సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. థియేటర్లలో నవ్వులు పోయించింది. కానీ ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్ 3', 'భగవంత్ కేసరి' సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి కానీ.. ఆయన మార్క్ కామెడీ కాస్త తగ్గిందనే కామెంట్లు వచ్చాయి. అయితే పొంగల్ ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో, అనిల్ తన స్ట్రాంగ్ జోన్ లో ఎంటర్టైన్ చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే వెంకటేశ్ కు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. గతంలో 'చంటి', 'కలిసుందాం రా', 'లక్ష్మి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్ 2'.. లాంటి సినిమాలు ఇదే సీజన్ లో వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. కాకపోతే గతేడాది సంక్రాంతికి వచ్చిన 'సైంధవ్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. పండక్కి తనకు కలిసొచ్చిన ఎంటర్టైనర్ తో కాకుండా, యాక్షన్ డ్రామాతో రావడం వెంకీని దెబ్బేసింది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ తన నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తున్నారో, అలాంటి కంటెంట్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ వస్తున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం' అనేది ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనింగ్ స్టోరీ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, ఉపేంద్ర లిమాయే, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి లాంటి నటులు కామెడీ పాత్రలను పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో వెంకీమామ, అనిల్ రావిపూడి కలిసి 'ఎఫ్ 2' రేంజ్ లో నవ్విస్తారో లేదో చూడాలి.