టాలీవుడ్ సినిమాలపై హిందీ నిర్మాత బిగ్ బెట్టింగ్!

టాలీవుడ్ లో ఈ ఏడాది వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

Update: 2024-04-17 04:50 GMT

టాలీవుడ్ లో ఈ ఏడాది వరుస పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలు సక్సెస్ అయితే 2024 ఏడాది మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ హవా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సౌత్ సినిమాల పట్ల నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది.

ఈ కారణంగా బడా డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రైట్స్ కోసం నార్త్ లో గట్టి పోటీ ఉంటుంది. అయితే ఈ రేసులో పెద్ద డిస్టిబ్యూటర్స్ మాత్రమే నిలబడగలుగుతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో రాబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలని AA ఫిలిమ్స్ హిందీలో రిలీజ్ చేస్తుంది. ప్రముఖ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని ఈ సినిమాల రిలీజ్ రైట్స్ ని భారీ ధరలకు సొంతం చేసుకోవడం విశేషం. ఆయన ఇదివరకే ప్రముఖ సంస్థలతో కలిసి బాహుబలి, పుష్ప, కాంతార, KGF లాంటి సినిమాలను నార్త్ లో డబ్ చేసి విడుదల చేశారు.

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ సినిమా జూన్ ఆఖరులో లేదంటే జులైలో రిలీజ్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అయిన అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని ఈ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.

అందుకే మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా నార్త్ ఇండియా రిలీజ్ రైట్స్ ని భారీ ధరకి అనిల్ తడాని దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆగష్టు 15న పుష్ప ది రూల్ రిలీజ్ కాబోతోంది. పుష్ప ది రూల్ మూవీ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ప్రస్తుతం ఉంది. ఈ సినిమాని నార్త్ లో అనిల్ తడాని రిలీజ్ చేయబోతున్నారు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న దేవర చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్ తో కలిపి అనిల్ తడాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ నార్త్ ఇండియా రైట్స్ ని అనిల్ సొంతం చేసుకున్నారు.

ఈ నాలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు కావడం విశేషం. అనిల్ తడాని రిలీజ్ చేస్తూ ఉండటం ఈ సినిమాలకి నార్త్ లో స్ట్రాంగ్ ప్రమోషన్స్ లభిస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే మరికొన్ని సౌత్ బిగ్ బడ్జెట్ సినిమాలపై కూడా అనిల్ ఫోకస్ చేస్తున్నారు. మరీనా సినిమాలు ఆయనకు ఎలాంటి లాభాలు అందిస్తాయో చూడాలి.

Tags:    

Similar News