ఏఎన్నార్ కళ్లజోడికి ఆ రేంజ్ లో క్రేజ్..!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏఎన్నార్ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏఎన్నార్ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తెలుగు పరిశ్రమని షిఫ్ట్ చేసేందుకు ముఖ్య పాత్ర పోషించారు ఏఎన్నార్. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి ఎన్నో సినిమాలకు ప్రొడక్షన్ సపోర్ట్ ఇచ్చారు. పౌరాణికం, జానపదం, సాంఘికం ఎలాంటి సినిమా అయినా నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే వారు ఏఎన్నార్.
ఏఎన్నార్ కి 1950 లో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో సంసారం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికి జానపద నటుడిగా పేరు తెచ్చుకున్న ఏఎన్నార్ కి ప్యాంటు, షర్ట్ పాత్రేమిటి అని అందరు అనుకున్నారట. దాన్ని సవాలుగా తీసుకుని ఆ వేషం కోసం తన పారితోషికం కూడా తగ్గించుకుని ఆ సినిమా చేశారట ఏఎన్నార్. సంసారం సినిమలో ఫస్ట్ హాఫ్ లో అమాయకంగా పల్లెటూరి కుర్రాడిగా మొరటుగా కనిపించే వేణు పాత్ర పట్నానికి వెళ్లగానే వేష, భాష, కవళికలు అన్నీ మారుతాయట. తన పాత్ర మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాగేశ్వర రావు కల నిజమాయేగా కోరిక తీరేగా పాటలో గ్లామర్ గా కనిపించాలని ఏదైనా స్పెషల్ గా ఆలోచించారట.
ఆ టైం లో మద్రాసు మౌంట్ రోడ్డులోని మయో ఆప్టికల్స్ షాప్ కి వెళ్లి అప్పటి గుండ్రని అద్దాలకు భిన్నంగా తన ముఖానికి సూట్ అయ్యే కళ్లద్దాలను తీసుకుని పాటలో ధరించారట. అంతే ఆ సినిమా విజయం సాధించడం ఆ పాటలో వాడిన అదే తరహా కళ్లజోడులు ఆ మయో ఆప్టికల్స్ షాప్ లో అప్పట్లోనే ఐదు వేలకు పైగా కళ్లద్దాలు అమ్ముడయ్యాయట. అక్కినేని కొనడం ఆ పాటలో వాడటం వల్లే తమ గిరాకి పెరిగిందని ఆ షాప్ యజమానులు అక్కినేనికి కృతజ్ఞతలు కూడా చెప్పారట.
ఇక అప్పటి నుంచి ఏఎన్నార్ కి ఎలాంటి కళ్లద్దాలు కావాలన్నా సరే అక్కడి నుంచే వచ్చే వట. అలా ఒక పాటలో ప్రత్యేకంగా ఉండాలని కళ్లద్దాలు పెడితే అది ట్రెండ్ అయ్యి ఆ టైం లోనే ఐదు వేల కళ్లజోడులు అమ్ముడయ్యాయంటే ఏఎన్నార్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.