దర్శన్ కేసు: కొడుకు అరెస్ట్.. తండ్రి గుండె నొప్పితో మృతి
తన కొడుకును అరెస్టు చేసినప్పటి నుండి చంద్రప్ప డిప్రెషన్‌లో ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో నిందితుల్లో ఒకరి తండ్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడుగా ఉన్న అనుకుమార్ తండ్రి శుక్రవారం మరణించాడు. తన కొడుకును అరెస్టు చేసినప్పటి నుండి చంద్రప్ప డిప్రెషన్‌లో ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
అంత్యక్రియల సమయంలో అనుకుమార్ తల్లి తన కొడుకు హాజరు కావాలని గట్టిగా చెప్పడంతో పోలీసులు శనివారం అర్థరాత్రి కోర్టు నుండి అనుమతి కోరడంతో అతడిని గట్టి భద్రతతో బెంగళూరు నుండి చిత్రదుర్గకు తీసుకువచ్చారని తెలుస్తోంది. నిందితుడు కుమార్ తండ్రి చంద్రప్ప శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అనుకుమార్ వచ్చే వరకు మృతదేహాన్ని తీయవద్దని అనుకుమార్ తల్లి , కుటుంబ సభ్యులు పట్టుబట్టారు అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెంగళూరు పోలీసులు శనివారం అర్థరాత్రి కోర్టు అనుమతి తీసుకుని అనుకుమార్‌ను చిత్రదుర్గకు తీసుకొచ్చారు. శనివారం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దర్శన్ అతడి 12 మంది సహాయకులకు పోలీసు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది. అది ఆదివారంతో ముగియనుంది. ఈ కేసులో పోలీసులు తమ విచారణ పూర్తి చేసేందుకు కస్టడీని పొడిగించాలని ఇంతకుముందు కోరారు.
అభిమాని రేణుకా స్వామిని హత్య చేసేందుకు నిందితులకు దర్శన్ 30లక్షలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో మరిన్ని భయానక విషయాలు బయటపడ్డాయి. దర్శన్ అతడి గ్యాంగ్ రేణుకాస్వామిని తీవ్రంగా కొట్టి, హింసించారు. అతడిపై వేడి మెటల్‌తో ముద్ర వేసి కరెంట్ షాక్ కూడా ఇచ్చారని దర్యాప్తులో తేలింది. గూడ్స్ ఆటోకి అతడి తలను బాదారు. మర్మాంగంపై తన్నారు. శరీరంపై మొత్తం 15 చోట్ల కమిలిపోయిన గాయాలున్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది.
జూన్ 8న పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు కోపంతో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేయాలని దర్శన్ గ్యాంగ్ నిర్ణయించుకుంది. ఈ కేసులో పోలీసులు.. దర్శన్, పవిత్రగౌడ్ ల ముఠాను జూన్ 11న అరెస్టు చేసి విచారిస్తున్నారు.