డైరెక్టర్ బాలీవుడ్‌ని వదిలి దక్షిణాదికి జంప్!
అనురాగ్ కశ్యప్ ప్రస్తుత బాలీవుడ్ స్థితిపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. సృజనాత్మకత పెంచుకోవడానికి హిందీ పరిశ్రమను వదిలేస్తానని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.
ప్రస్తుత పరిశ్రమలో కొనసాగితే వృద్ధుడిగా చనిపోతానని భావిస్తున్నానని, పరిశ్రమ మనస్తత్వం పట్ల తన నిరాశ, అసహ్యం వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్. ముంబైని, హిందీ చిత్ర పరిశ్రమను వదిలి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడు. మరో ఏడాదిలో తాను దక్షిణాదికి వెళ్లిపోతున్నానని ప్రకటించాడు. బాలీవుడ్ ఇప్పటిలానే కొనసాగితే తాను ఇక్కడే కొనసాగలేనని అన్నాడు.
అనురాగ్ కశ్యప్ ప్రస్తుత బాలీవుడ్ స్థితిపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. సృజనాత్మకత పెంచుకోవడానికి హిందీ పరిశ్రమను వదిలేస్తానని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. హిందీ చిత్ర పరిశ్రమ లాభాల కోసం చూస్తుందని, రీమేక్‌లు, స్టార్ మేకింగ్ సంస్కృతిపై పరిశ్రమ మక్కువ చూసి అసహ్యించుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ వ్యవహారం క్రియేటివిటీని చంపేస్తుందని అన్నారు. చాలా పెద్ద నటులే ఇలా ప్రవర్తించడం బాధిస్తుందని తన ఆవేదనను వ్యక్తపరిచారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ పరిణామాలపై విశ్లేషించారు.
పెరుగుతున్న స్టార్ల పారితోషికాలు, నిర్మాణ ఖర్చులపై తన ఆందోళనను వ్యక్తం చేశాడు. నిర్మాతలు లాభాలు, మార్జిన్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, ఆర్థికపరమైన చిక్కుల కారణంగా సినిమాలతో ప్రయోగాలు చేయడం తనకు కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. సినిమాని ఎలా అమ్మాలి అనే ప్రశ్న ఉంటుందని, ఇది సినిమాని తీసే ప్రక్రియ ఆనందాన్ని హరిస్తుందని అన్నారు. కొత్త ఆలోచనలతో రిస్క్‌లు తీసుకోవడం కంటే విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేయాలనే పరిశ్రమ ధోరణిపై నిరాశను వ్యక్తపరిచాడు. నటీనటులు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం కంటే గ్లామర్, ఫిజికల్ అప్పీరెన్స్‌పై దృష్టి సారిస్తారని, వారిని వర్క్‌షాప్‌లకు బదులు జిమ్‌కు పంపుతున్నారని ఆయన విమర్శించారు. మంజుమ్మెల్ బోయ్స్ లాంటి ప్రయోగాలు బాలీవుడ్ లో చేయలేరని కూడా వ్యాఖ్యానించారు.