మెగాస్టార్ 'హిట్లర్'కి పాతికేళ్లు!

Update: 2022-01-04 09:30 GMT
చిరంజీవి ఆడుతూ పాడుతూ మెగాస్టార్ అయిపోలేదు. మెగాస్టార్ అనే ఆ బిరుదు వెనుక ఆయన పడిన తపన .. చేసిన కృషి .. పడుతూ లేస్తూ సాగించిన అలుపెరగని పోరాటం కనిపిస్తాయి. తనని తాను మలచుకున్న శిల్పి .. తన చుట్టూ ఉన్నవారి మనసులను గెలుచుకున్న విజేత ఆయనలో కనిపిస్తారు. చిరంజీవికి విజయాలు కొత్తకాదు .. అవి తెచ్చిన అవార్డులు కొత్తకాదు. కానీ 'హిట్లర్' సినిమా విజయానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇక చిరూ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయనకి తిరుగులేని సక్సెస్ ను ఇచ్చిన సినిమా ఇది.

అలాంటి ఈ సినిమా సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమ్.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. 1997 జనవరి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెరపైకి రావడానికి వెనుక చాలా తతంగమే జరిగింది. ముందుగా ఈ కథను మలయాళంలో మమ్ముట్టి చేశారు. సిద్ధిఖీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ 1996లో 'హిట్లర్' పేరుతోనే విడుదలైంది. ఆ సినిమా రిలీజ్ కి ముందే తెలుగులో రీమేక్ చేయాలని ఎడిటర్ మోహన్ అనుకున్నారు.

ఈ విషయాన్ని ఆయన రైటర్ మరుధూరి రాజాకి చెప్పారు. తెలుగు వెర్షన్ కి రైటర్ గా ఆయన ఫిక్స్ అయ్యారు. తెలుగులో మోహన్ బాబు హీరోగా ఈవీవీ దర్శకత్వంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. కానీ అప్పటికే 'వీడెవడండీ బాబూ' .. 'అదిరింది అల్లుడు' వంటి మోహన్ బాబు సినిమాలకి ఈవీవీ కమిట్ అయ్యారు. అందువలన ఆయనకి ఈ సినిమా చేయడం కుదరలేదు. దాంతో ఈ సినిమాను చిరంజీవితో .. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అప్పటికే వరుస ఫ్లాపులతో చిరంజీవి సతమతమవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఈ సినిమాను చేయడానికి అంగీకరించారు. అయితే చిరూ సినిమాకి రాసే అవకాశం లభించిందని ఆనందించిన మరుధూరి రాజాకి నిరాశే ఎదురైంది. ముత్యాల సుబ్బయ్య ప్రాజెక్టులోకి ఎంటర్ కాగానే మరుధూరి రాజాకి బదులుగా ఎల్బీ శ్రీరామ్ ను తీసుకున్నారు. దాంతో మరుధూరి రాజా చాలా అసంతృప్తికి లోనయ్యారట. అప్పుడు ఆయనతో ఒక వెర్షన్ రాయించారు. ఈ విషయాలన్నీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయనే పంచుకున్నారు.

అలా చిరంజీవి - రంభ నాయకా నాయికలుగా చేసిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. వరుస ఫ్లాపుల నుంచి చిరంజీవిని బయటపడేయడమే కాకుండా, అక్కడి నుంచి మెగాస్టార్ కెరియర్ ను మళ్లీ సక్సెస్ దిశగా పరుగులు తీయించింది. సంగీత దర్శకుడిగా కోటి ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేశారు. 'నడక కలిసిన నవరాత్రి' అనే వేటూరి వారి పాట ఒక ఊపు ఊపేసింది. ఇక యేసుదాస్ స్వరంలో నుంచి జాలువారిన సిరివెన్నెల వారి 'ఓ కాలమా' అనే పాట హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాకి ఆయనే దర్శకుడు కావడం విశేషం.


Tags:    

Similar News