నమ్మినందుకు 45 లక్షలు మోసపోయాను: యాంకర్ రవి

Update: 2021-12-05 12:30 GMT
ఎవరైనా సరే నమ్మితేనే మోసం చేస్తారు .. నమ్మకపోతే మోసపోయే అవకాశమే లేదు. అలా అని ఎవరినీ నమ్మకుండా జీవితాన్ని సాగించడం కూడా కష్టమే. ఏదో ఒక సందర్భంలో .. ఎక్కడో ఒక చోట .. ఎవరినో ఒకరిని నమ్మవలసి ఉంటుంది.  అలా నమ్మినప్పుడే ఒక్కోసారి మోసపోవలసి వస్తుంటుంది. ఎవరో తెలియనివారు మోసం చేసినప్పుడు, ఆ ప్రభావం మనసుపై తక్కువగా ఉంటుంది. కానీ బాగా దగ్గరైపోయి మోసం చేసినప్పుడు దానిని తట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి పరిస్థితి తనకి ఎదురైందని తాజాగా యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.

యాంకర్ గా .. హోస్ట్ గా రవికి మంచి పేరు ఉంది. కార్యక్రమం ఏదైనా .. స్టేజ్ ముందుగా ఏ స్థాయి సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ, తన యాంకరింగ్ తో హుషారుగా నడిపిస్తాడు. తన సమయస్ఫూర్తితో నవ్విస్తాడు .. గేమ్ షో ల ద్వారా మరింత సందడి చేస్తాడు. అందువలన యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అలాంటి రవి ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో తనదైన తరహాలో కనిపించాడు. రవి మాటలు కొన్ని .. రవి ఆటలు కొన్ని ఆయనకి కాస్త నెగిటివిటీనే తెచ్చిపెట్టాయి. ఆ తరహా అంశాలనే బిగ్ బాస్ ప్రసారం చేసిందనే వాదన కూడా లేకపోలేదు.

హౌస్ లోపల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు .. బయటికి వచ్చిన అవుట్ పుట్ ను బట్టే ఓట్లు పడతాయి. అలాంటి కంటెంట్ మాత్రమే బయటికి రావడం వల్లనే, రవిపై ఆడియన్స్ లో ఈ తరహా అభిప్రాయాలు కలిగాయనేది ఆయన సన్నిహితుల మాట. అనుకోకుండా హౌస్ నుంచి బయటికి వచ్చేసిన రవి, తనపై .. తన ఫ్యామిలీపై వచ్చిన కామెంట్లపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. జీవితంలో తాను మోసపోయానేగానీ, తాను ఎవరినీ మోసం చేయలేదంటూ తనకి ఎదురైన ఒక సంఘటన గురించి ప్రస్తావించాడు.

స్నేహం పేరుతో ఒక వ్యక్తి నాకు బాగా సన్నిహితుడయ్యాడు. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు .. ఎక్కువగా గుడికి వెళ్లి వస్తుండేవాడు. తాను బిజినెస్ పెట్టుకోవడానికి 45 లక్షలు అవసరమనీ, ఓ 20 రోజుల్లో తిరిగిచ్చేస్తానని చెప్పాడు. అప్పటివరకూ ఆయన పట్ల నాకు గల అభిప్రాయం కారణంగా నేను అతనికి డబ్బు ఇచ్చాను. ఆ 45 లక్షలను ఇవ్వకుండా అతను మోసం చేశాడు. ఆ డబ్బు తిరిగి రావాలని ఇప్పటికీ నా భార్య పూజలు .. ఉపవాసాలు చేస్తోంది. ఎదుటివారికి సాయపడాలనే నా ఉద్దేశమే దీనికి కారణం. ఒక వ్యక్తిపై .. అతని ఫ్యామిలీపై కామెంట్లు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి" అని రవి చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News