బాలీవుడ్లో ఇంకో పెద్ద డిజాస్టర్

Update: 2016-08-25 13:30 GMT
రెండు వారాల కిందటే బాలీవుడ్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది ‘మొహెంజదారో’ రూపంలో. వంద కోట్లకు పైగా బడ్జెట్‌ తో అశుతోష్ గోవారికర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఆ ఫ్లాప్ దెబ్బ నుంచి కోలుకునే లోపే మరో భారీ బడ్జెట్ మూవీ బోల్తా కొట్టింది. ఈ రోజు విడుదలైన టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా ‘ఎ ఫ్లయింగ్ జాట్’కు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి మార్నింగ్ షో పూర్తవగానే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శక్తిమాన్ సీరియల్ దీని కంటే బెటర్ అంటూ ట్విట్టర్లో ట్రోలింగ్ ఓ రేంజిలో జరుగుతోంది.

ఆ మధ్య ‘ఎ ఫ్లయింగ్ జాట్’ ట్రైలర్ చూసినపుడే.. ఇది వీడియో గేమ్ టైపు సినిమా అన్న సంగతి అర్థమైంది. ఇప్పటికే క్రిష్ సిరీస్ లో ఇలాంటి విన్యాసాలు చాలా చూశారు జనాలు. అతీంద్రియ శక్తులున్న ఓ దుష్ట విలన్.. జనాల్ని పీడిస్తుంటాడు. అరాచకాలకు పాల్పడుతుంటాడు. అప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు. ‘క్రిష్’ తరహాలోనే సూపర్ మ్యాన్ డ్రెస్సేసుకుని.. ముఖానికి చిన్న మాస్కేసుకుని వచ్చేస్తాడు. విలన్ పని పడతాడు. ఇదే ‘ఫ్లయింగ్ జాట్’ కథ. ఇలాంటి స్టోరీలు ఇప్పటికే జనాలు చాలా చూశారు. మళ్లీ అదే కథతో రొటీన్ సన్నివేశాలతో విసుగు పుట్టించాడంటూ రెమోను తిట్టిపోస్తున్నారు జనాలు. గ్రాఫిక్స్ ద్వారా ఇండియాలో అనేక ప్రాంతాల్ని క్లీన్ చేసినట్లు చూపించినందుకు మోడీ ‘స్వచ్ఛ’ పురస్కారం అందిస్తాడని ఈ సినిమాపై సెటైర్లు వేస్తున్నారు. హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ ఇందులో విలన్ పాత్ర పోషించినా అది ఎందుకూ కొరగాకుండా పోయిందని.. టైగర్ కెరీర్ కు ఈ సినిమా పెద్ద బ్రేక్ అని చెప్పుకుంటున్నారు. సినిమా డిజాస్టర్ అని తొలి షోతోనే తీర్మానించేశారు జనాలు.
Tags:    

Similar News