చాలా మంది ఇదే క‌దా నా క‌థ అనుకుంటారు.. అందుకే ఆస్కార్ కి!

Update: 2022-09-21 04:33 GMT
ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అవార్డ్స్ వేడుక‌ల గురించి ఆరు  నెల‌ల ముందుగానే డిబేట్ మొద‌లైంది. ఈసారి భార‌త‌దేశం నుంచి అధికారికంగా ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ బ‌రిలో నిలుస్తుంద‌ని అంతా భావించారు. తెలుగు వారు ఒక ర‌కంగా ఆర్.ఆర్.ఆర్ రేసులో నిల‌వాల‌ని బ‌లంగా కోరుకున్నారు. కానీ ఒక గుజ‌రాతీ చిన్న బ‌డ్జెట్ చిత్రం 'ది లాస్ట్ షో' (చెల్లో షో) దీనికి బిగ్ బ్రేక్ వేసింది.

బ‌డ్జెట్ లో.. విజువ‌ల్ రిచ్ నెస్ లో.. యాక్ష‌న్ లో .. 24 శాఖ‌ల కాన్వాస్ లో ఈ మూవీ కి ఆర్.ఆర్.ఆర్ తో ఏమాత్రం పోలికే లేదు. కానీ ఇలాంటి సినిమాని ఆస్కార్ నామినేష‌న్ కి భార‌త‌దేశం త‌ర‌పున ఎందుకు జూరీ ఎంపిక చేసింది? అంటే దానికి స‌మాధానం స్ప‌ష్ఠంగా ఉంది.

నిజానికి 'చెల్లో షో'లో పేద‌రికాన్ని.. స‌గ‌టు బ‌తుకు జీవుడిని చూపించాడు. ఒక రైల్వే ప్లాట్ ఫామ్ పై జీవితాలు ఎలా ఉంటాయో చూపించారు. క‌డు ధైన్యంలో పేద‌రికంలో చిన్నారుల జీవితాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు గ‌ట్టారు. ఇందులో ఎంతో ఆర్ధ్ర‌త కనిపిస్తోంది. జీవించాల‌న్న ఆశ క‌నిపిస్తోంది. ల‌క్ష్యం కోసం ఒక‌ ప్ర‌య‌త్నం క‌నిపిస్తోంది. అంత‌టి పేద‌రికంలోనూ సినిమాలు తీయాల‌ని త‌పించే చిన్నారి బాల‌కుడి ప‌ట్టుద‌ల క‌థ‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. సినిమాలు చూడాలి.. సినిమా తీయాలి! అన్న‌దే ఆ బాల‌కుడి ల‌క్ష్యం  ఈ సినిమాలో.

ప్ర‌తిదీ ఒక ఎమోష‌న‌ల్ ఘ‌ట్టంగా దీనిని మ‌లిచార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. చాలా మంది ఇదే క‌దా నా క‌థ అనుకుంటారు.. అందుకే ఆస్కార్ కి వెళుతోందన్న వాస్త‌వం కూడా క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. భార‌త‌దేశంలో ధ‌న‌వంతులు 4శాత‌మే. మెజారిటీ వ‌ర్గాలు పేద‌రికంలోనే ఉన్నాయ‌న్న స‌త్యానికి సంబంధించిన క‌థ‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మే ద‌ర్శ‌కుడి స‌క్సెస్ కి ఆలంబ‌న అని చెప్పాలి.

ఆస్కార్ జూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేయ‌డం వెన‌క చాలా మ‌ద‌నం ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. భారీ బ‌డ్జెట్ల‌తో విజువ‌ల్ రిచ్ సినిమాలు తీసే ఫిలిం మేక‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ గుజ‌రాతీ మూవీని జూరీ ఎంపిక చేసి ఉండ‌దు. ఆర్.ఆర్.ఆర్- కాశ్మీర్ ఫైల్స్ - కేజీఎఫ్ 2 లాంటివి వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను సాధించినా కానీ జూరీని మెప్పించ‌లేక‌పోయాయ‌న్న వాస్త‌వాన్ని అంగీక‌రించాలి. మొత్తానికి ఒక గుజ‌రాతీ చిత్రం ఈసారి ఆస్కార్ నామినేష‌న్ లో నిలిచి భార‌త‌దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. చెల్లో షో (ది లాస్ట్ షో) టీమ్ కి తుపాకి త‌ర‌పున‌ ఆల్ ది బెస్ట్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News