తీరు మారని గరం బాబు

Update: 2016-02-28 13:30 GMT
సాయి కుమార్ కొడుకు ఆది.. మొదట ప్రేమ కావాలి, లవ్ లీ అంటూ కాసింత తన ఏజ్ కు, రేంజ్ కు తగ్గట్లుగా డిఫరెంట్ సినిమాలనే చేశాడు. అవి కాస్త జనాల్లోకి వెళ్లేసరికి.. సడెన్ గా స్టైల్ మార్చేసి.. హఠాత్తుగా మాస్ రూట్ లోకి వెళ్లిపోయాడు. గాలిపటం అంటూ ఓ మూవీ వచ్చినా అది ఎగరలేక చతికిలబడింది. ఇక రీసెంట్ గా ఆదాశర్మతో కలిసి గరం పుట్టిద్దామని అనుకున్నాడు కానీ.. ఆ సెగ ఆదికే కొట్టింది.

కనీస మాత్రం వసూళ్లు కూడా లేక.. ఆది నటించిన గరం అట్టర్ ఫ్లాప్ అనిపించుకుంది. దీంతో తర్వాత చేసే ప్రాజెక్టు విషయంలో కేర్ తీసుకుంటాడని అనుకోవడం సహజం. కానీ.. ఆది మాత్రం ఏ విధంగానూ తగ్గడం లేదు. మరోసారి అలాంటి మాస్ మూవీనే ట్రై చేస్తున్నాడని... ఈ మూవీ స్టిల్స్ చెబుతున్నాయి. ఇప్పుడు వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో చుట్టాలబ్బాయి అనే సినిమా చేస్తున్నాడు అది. అహ నా పెళ్లంట - పూల రంగడు వంటి హిట్ చిత్రాలు తీసిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ఫాంలో ఉన్నాడనే అనాలి.

చుట్టాలబ్బాయిలో ఆది సరసన ప్రణీత హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ - రొమాంటిక్ ఎంటర్టెయినర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ అంటూ విడుదల చేసిన పిక్చర్స్ చూస్తే.. మరోసారి గరం పుట్టించడానికి ఆది గట్టిగానే ట్రై చేస్తున్నాడని అనిపించక మానదు. పొట్టి పొట్టి డ్రస్ లు వేసుకున్న విదేశీ భామలతో రచ్చ బాగానే చేస్తున్నాడు కానీ.. కంటెంట్ కరెక్ట్ గా లేకపోతే జనాలు తిరగ్గొడతారని ఇప్పటికైనా అర్ధం అయ్యిందో లేదో ఈ హీరోకి.
Tags:    

Similar News