చైతూ పిలవలేదు .. నేనే వచ్చాను: ఆమిర్ ఖాన్

Update: 2021-09-20 07:31 GMT
ప్రేమకథలకు తెలుగు తెర అక్షయపాత్ర వంటిది .. ఎన్నిరకాల ప్రేమకథలు వచ్చినా మరో ప్రేమకథకు చోటు ఉండే పుష్పక విమానం వంటిది. అలాంటి ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రేమకు .. ఆకర్షణకు మధ్య తేడా ఏమిటనేది చాలా మందికి తెలియదు. అందువల్లనే మాటల్లోను .. పాటల్లోను కోరిక కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ నిలబడుతుంది .. పరిస్థితులతో కలబడుతుంది. కలిసి బతకాలంటే కలిసి చావడానికి కూడా సిద్ధపడాలనే ఒక కాన్సెప్ట్ తో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు.

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకలో ఆమిర్ ఖాన్ ను చూసి అంతా షాక్ అయ్యారు. అనుకోకుండా ఆయన రావడం టీవీల ముందు కూర్చున్న వాళ్లందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఆమిర్ సినిమా 'లాల్ సింగ్ చద్దా'లో చైతూ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ విషయం తెలిసినవాళ్లు, ఆ పరిచయంతో చైతూ ఆహ్వానిస్తే వచ్చి ఉంటాడని అనుకున్నారు. కానీ చైతూ పట్ల అభిమానంతో ఆమిర్ వచ్చాడేగాని, ఆయనను ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానించలేదనే విషయం ఆ తరువాత స్పష్టమైంది.

ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ .. 'లాల్ సింగ్ చద్దా' సినిమా షూటింగులో నేను నాగచైతన్యను చూశాను. ఆయన ఎంతమంచి నటుడో .. అంతమంచి మనసున్న మనిషి అనే విషయం నాకు అర్థమైంది. ఆ కారణంగా మా ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నట్టుగా ఉంటుందీ .. ఇంతమంచి మనిషిని నాకు పరిచయం చేసినందుకు చైతూ పేరెంట్స్ ను అభినదించినట్టుగాను ఉంటుందని నేనే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తరువాత, ఇంతమంది మంచి మనుషుల మధ్య జరుగుతున్న ఈ వేడుకలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

ఇక నాగచైతన్య కూడా తాను ఆమిర్ ను ఆహ్వానించలేదని చెప్పాడు. సినిమా ట్రైలర్ చూడగానే చాలా బావుందంటూ ఆయన నాకు మెసేజ్ పెట్టారు. 'ఈ ఆదివారం ఎక్కడ ఉంటావు?' అని అడిగారు. ఇలా 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో ఉంటాను అని చెప్పాను. అయితే తాను వస్తానని చెప్పేసి వచ్చేశారని అన్నాడు. ఆయనను ఈ వేడుకలో ఇలా చూస్తుంటే నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను. ఆయనతో కలిసి 'లాల్ సింగ్ చద్దా' షూటింగులో పాల్గొన్న రోజులను నేను ఎప్పటికీ మరిచిపోలేను. కెరియర్ పరంగాను .. జీవితంలోను ఆ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అని చైతూ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News