ఈ ద‌శాబ్ధ‌పు బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'బాహుబ‌లి 2' కాదా?

Update: 2019-12-04 01:30 GMT
ద‌క్షిణాది చిత్రాలంటే బాలీవుడ్ వాళ్ల‌కు ఎప్పుడూ చిన్న చూపే ఉండేది. తెలుగు సినిమాలను త‌క్కువ‌గానే చూసేవారు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ద‌శాబ్దాల పాటు ఇలానే ఆలోచించారు. భార‌తీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే అనే ధోర‌ణి ఇప్ప‌టికీ చెరిగిపోలేదు అన‌డానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. మ‌ద్రాసీలు సాంబార్ ఇడ్లీ అంటూ ఇప్ప‌టికీ కామెడీలు చేస్తారు అక్క‌డ‌. అయితే ఉత్త‌రాదికి బాలీవుడ్ కి ధీటుగా సౌత్ సినిమా ఎదుగుతోంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ వాళ్ల వైఖ‌రి మారుతోంది. అయినా ఇంకా మ‌న‌పై అల‌స‌త్వం అలానే ఉంది.

`బాహుబ‌లి` వంటి సెన్సేష‌న్ త‌ర్వాతా యావ‌త్ సినీ ప్ర‌పంచం మొత్తం తెలుగు సినిమావైపు చూస్తున్న విష‌యం తెలిసిందే. హిందీ వాళ్లు మ‌న సినిమాల్ని రీమేక్ చేసేందుకు పోటీ ప‌డుతున్నారు. అయితే దీనిని కేవ‌లం బిజినెస్ కోణంలో మాత్ర‌మే చూస్తున్నారా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. మ‌నం ఎదుగుతున్నా ఆ విష‌యాన్ని బాలీవుడ్ బిగ్గీస్ మ‌రోసారి మ‌రుగున ప‌డేసే ప్ర‌య‌త్నం చేశారు.

తాజాగా బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆఫ్ ద డెకేడ్ ఏ సినిమా అనే చ‌ర్చ జ‌రిగింది. యాహూ ఇండియా నిర్వ‌హించిన రివ్వ్యూలో ఆమీర్ ఖాన్ న‌టించిన `దంగ‌ల్‌` చిత్రం ది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఆఫ్ ది డెకేడ్ గా నిలిచింది. 2016లో విడుద‌లైన `దంగ‌ల్‌` వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.2000 కోట్లు వ‌సూలు చేసి దేశంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. హ‌ర్యానా రెజ్ల‌ర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించి ఈ ద‌శాబ్దంలో రిలీజైన అత్యుత్త‌మ చిత్రంగా నిలిచింది. ఈ స‌ర్వే కోసం టాప్ 10 చిత్రాల‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నా అందులో `బాహుబ‌లి-2` ప్ర‌స్థావ‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. జాబితాలో భ‌జ‌రంగి భాయిజాన్- సుల్తాన్- టైగ‌ర్ జిందా హై వంటి చిత్రాల్ని చేర్చినా బాహుబ‌లి 2 ప్ర‌స్థావ‌నే లేదు ఎందుక‌నో.

`దంగ‌ల్‌`తో పోలిస్తే దేశీయంగా నంబ‌ర్ వ‌న్ సినిమా బాహుబ‌లి 2. ఇండియాయేత‌ర వ‌సూళ్లు క‌లుపుకుంటేనే దంగ‌ల్ పుడింగు. చైనా వ‌సూళ్ల‌ను ప‌క్క‌న‌ పెడితే ఇండియాలో నంబ‌ర్ వ‌న్ స్థానం `బాహుబ‌లి-2`దే. కానీ యాహూ సెర్చ్ `దంగ‌ల్‌` నే నంబ‌ర్ వ‌న్ అంటూ ప్ర‌క‌టించింది. టాప్ 10లో కేవ‌లం హిందీ సినిమాల్ని మాత్ర‌మే యాహూ సెర్చ్ నింపేసింది. మ‌రి బాహుబ‌లి 2 గురించిన క‌నీస ప్ర‌స్థావ‌నే లేదు ఎందుకో అర్థం కాని గంద‌ర‌గోళ‌మే మ‌రి.



Tags:    

Similar News