ఐష్ సినిమా షూటింగ్..అసిస్టెంట్ డైరెక్టర్‌ కు ప్రమాదం

Update: 2017-11-06 07:09 GMT
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచి తూచి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరబ్జీత్.. యే దిల్ హై ముష్కిల్ సినిమాలతో పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘ఫ్యానీ ఖాన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ముంబయిలో జరుగుతుండగా.. ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రమాదానికి గురైంది.

ముంబయిలోని ఫ్లోరా ఫౌంటైన్ ఏరియాలో షూటింగ్ జరుగుతుండగా.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాకీ టాకీలో యూనిట్ సభ్యులతో మాట్లాడుతూ రోడ్డు దాటిందట. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద చాలా వేగగా వచ్చి ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి.. ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఆమె పరిస్థితి ఏంటన్నది తెలియరాలేదు.

‘ఫ్యానీ ఖాన్’లో ఐశ్వర్యతో పాటు అనిల్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇద్దరు మధ్య వయస్కుల మధ్య చిగురించే ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. రాజ్ కుమార్ రావు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అతుల్ మంజ్రేకర్ ఈ చిత్రానికి దర్శకుడు. డచ్ సినిమా ‘ఎవ్రిబడీ ఈజ్ ఫ్యామస్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Tags:    

Similar News