'ఆచార్య' ఎఫెక్ట్: NTR30 కోసం కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల..?

Update: 2022-07-12 10:30 GMT
'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివ.. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో సందేశాన్ని జోడిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.అయితే శివ తాను డైరెక్ట్ చేసే సినిమాల బిజినెస్ విషయంలోనూ జోక్యం చేసుకుంటారనే టాక్ ఉంది.

సినిమా నిర్మాణాన్ని నిర్వహించడమే కాదు.. మార్కెటింగ్ పై కూడా కొరటాల దృష్టి పెడుతుంటారని అంటుంటారు. దీని వల్ల అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారనే టాక్ ఉంది. ఇదే విషయం మీద ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు కొరటాల. ఫస్ట్ సినిమా చేసిన యూవీ క్రియేషన్స్ వంశీ ప్రమోద్ ఇండస్ట్రీకి కొత్త ప్రొడ్యూసర్.. అందులోనూ తన ఫ్రెండ్స్ కావడం వల్ల ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటామని చెప్పాడు.

అదే సీనియర్ నిర్మాతలతో చేసి ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఆలోచించే వాడిని కాదని అన్నారు. రెండో సినిమా చేసిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా కొత్తవారే. బడ్జెట్ ఇంత అవుద్దని.. సినిమా వ్యాపారం ఇలా ఉంటుందని వారిని గైడ్ చేయాల్సిన అవసరముంది. నన్ను నమ్మి నా మీద బాధ్యత పెట్టినప్పుడు నాది నేను తీసుకొని వెళ్లిపోవడం తప్పు. అందుకే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని కొరటాల తెలిపారు.

'భరత్ అనే నేను' సినిమా సీనియర్ నిర్మాత దానయ్యతో చేసాను కాబట్టి.. బిజినెస్ లో నేను కలుగజేసుకో లేదు. కానీ 'ఆచార్య' ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ బిజినెస్ లో యాక్టీవ్ గా లేరు. అతను నాకు చాలా క్లోజ్ ప్రెండ్ కాబట్టి అన్ని విషయాలు చెప్పాలి. ప్రొడ్యూసర్స్ అడిగితే సలహా ఇస్తాను తప్పితే.. అంతకు మించి తన పాత్ర ఏదీ ఉండదని కొరటాల వివరణ ఇచ్చుకున్నారు.

కారణాలు ఏవైనా 'ఆచార్య' సినిమా బిజినెస్ అంతా దర్శకుడే చూసుకున్నాడనే టాక్ వచ్చింది. అందులోనూ అధిక రేట్లకే విక్రయించారని చెప్పుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన మెగా మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయాల్సిన బాధ్యత కొరటాల మీద పడిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు దర్శకుడు తన తదుపరి సినిమా మార్కెటింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారా అనే చర్చ జరుగుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈయన కొరటాల స్నేహితుడనే సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా దర్శకుడు అదనపు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని టాక్ వచ్చింది.

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం #NTR30 సినిమాకు సంబంధించిన ఫైనాన్షియల్ సేల్స్ మరియు మార్కెటింగ్ అంశాలలో కొరటాల శివ ఏమాత్రం కలుగజేసుకోవాలని అనుకోవడం లేదట. 'ఆచార్య' ఫలితం తర్వాత మిగతా వ్యవహారాల కారణంగా దర్శకుడి స్క్రిప్ట్ మీద ప్రభావం పడుతోందని విమర్శలు రావడంతో అలాంటి నిర్ణయం తీసుకున్నారట.

తన స్నేహితుడికి సపోర్ట్ గా ఎలాగూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది కాబట్టి.. ఈసారి సినిమా అమ్మకాలు, డిస్ట్రిబ్యూషన్ మరియు భాగస్వామ్య విషయాలకు దూరంగా ఉండాలని కొరటాల డిసైడ్ అయ్యారట. #NTR30 ఆర్థిక కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా సినిమా మేకింగ్ మీదనే పెట్టాలని ఫిక్స్ అయ్యారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Tags:    

Similar News