రంగ‌స్థ‌ల సినీన‌టుడు గిరీష్ క‌ర్నాడ్ మృతి

Update: 2019-06-10 04:46 GMT
రంగ‌స్థ‌లం నుంచి వ‌చ్చి సినీరంగంలో అజేయ‌మైన కెరీర్ ని సాగించిన అరుదైన ట్యాలెంట్ గిరీష్ క‌ర్నాడ్. 81 ఏళ్ల ఈ అస‌మాన‌ ప్ర‌తిభావంతుడు నేటి ఉద‌యం ఆయ‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 19మే 1938 లో మహారాష్ట్ర- మథేరాలో జన్మించారు. గిరీష్ కర్నాడ్. తండ్రిపేరు రఘునాధ్ కార్నాడ్.. తల్లి కృష్ణాబాయి. క‌న్న‌డం- తెలుగు- త‌మిళం-మ‌ల‌యాళం- హిందీ భాష‌ల్లో ఆయ‌న గొప్ప పేరున్న న‌టుడిగా వెలిగిపోయారు.

గిరీష్ క‌ర్నాడ్ న‌టించిన తెలుగు సినిమాలు ప్రేక్ష‌కాభిమానుల‌కు ఎంతో స్పెష‌ల్. కింగ్ నాగార్జున- సుశ్మిత సేన్ జంట‌గా న‌టించిన ర‌క్ష‌కుడు చిత్రంలో గిరీష్ క్లాస్ విల‌నీని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. రంగ‌స్థ‌ల న‌టుడిగా ఆయ‌న ప్ర‌తిభ గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ప‌త్రిక‌ల్లో.. మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. విక్ట‌రీ వెంక‌టేష్ ధ‌ర్మ‌చ‌క్రం చిత్రంలో దుష్టుడైన తండ్రి పాత్ర‌లో న‌టించారు. ఆ సినిమాలో వెంకీ అస‌మాన న‌ట‌న‌కు పేరొచ్చింది. ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబిబిఎస్, ప్రేమికుడు వంటి ఎన్నో  చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు.

గిరీష్ గొప్ప సాహితీవేత్త‌. ఆయ‌న‌కు క‌న్న‌డ నాట అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. కన్నడ సాహిత్యానికి కన్నడ సినిమాకి ఆయ‌న‌ చేసిన సేవలను గుర్తించి కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌర‌వించింది. ఇక ఆయ‌న కీర్తి కిరీటంలో చేర‌ని క‌లికితు రాయి లేదు. అవార్డులు - రివార్డుల‌కు కొదవే లేదు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పద్మశ్రీ- పద్మభూషణ్‌- జ్ఞానపీఠ్ అవార్డుల్ని అందుకున్నాడు. స్నేహితుడు బీవీ కారంత్ తో క‌లిసి వంశ వృక్ష (1972) అనే క‌న్న‌డ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ సినిమాకి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

    

Tags:    

Similar News