ప్లీజ్ .. సినిమా కోసం ప్రాణాలు తీసుకోవద్దు: ప్రభాస్

Update: 2022-03-15 13:49 GMT
మా హీరో ఫైట్లు కుమ్మేస్తాడు .. మా హీరో డాన్స్ ఇరగదీసేస్తాడు అంటూ ఒకప్పుడు అభిమానుల మధ్య గొడవలు జరిగేవి. ఆ తరువాత ఒకరికి మించిన కటౌట్లు ఒకరు పెడుతూ అక్కడా తగవులు పడేవారు. ఇక హీరోయిజాన్ని నిర్ణయించేది వసూళ్లు మాత్రమేనని భావించిన తరువాత అంతా కూడా ఆ వైపు దృష్టిపెట్టారు. అక్కడ కూడా ఇదే కొట్లాట. అంటే తమ హీరోల విషయంలో టాపిక్ మారుతుందిగానీ కొట్టుకోవడమనేది కామన్ అయిపోయింది.

ఇక మధ్య కాలంలో చాలావరకూ ఇలాంటి గొడవలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్ .. సినిమా అనేది ఒక బిజినెస్ అనే విషయం అర్థమైన తరువాత చాలామంది ఏ సినిమాకి ఆ సినిమాగానే చూస్తున్నారు. తాము ఆశించిన .. తమకి కావలసిన ఎంటర్టైన్ మెంట్ ను పొందుతున్నారు.

కానీ ఇంకా అక్కడక్కడా తమ హీరోను ఎవరైనా ఏమైనా అంటే ఆవేశపడటం ..  ప్రాణాల మీదికి తెచ్చుకోవడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 'రాధే శ్యామ్' సినిమాకి మంచి టాక్ రాలేదనే మనస్తాపంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడమే అందుకు నిదర్శనం.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన 'రాధే శ్యామ్' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. 3 రోజుల్లోనే ఈ సినిమా 151 కోట్లను వసూలు చేసింది.

అయితే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చిందనే మనస్తాపంతో ప్రభాస్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూల్ తిలక్ నగర్ కి చెందిన రవితేజ అనే 24 ఏళ్ల యువకుడు 'ఉరి' వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఊహించని ఈ సంఘటనతో ఆ యువకుడి కుటుంబ సభ్యులతో పాటు ఊళ్లోని వాళ్లంతా బాధపడుతున్నారు.

తన అభిమాని ఇలా చేశాడనే విషయం ప్రభాస్ దృష్టికి వెళ్లింది. ఆ కుటుంబానికి తక్షణ సాయం క్రింద ప్రభాస్ 2 లక్షలు ప్రకటించాడు. తమ నుంచి ఆ కుటుంబానికి అండదండలు ఉంటాయని ప్రభాస్ పీఆర్ టీమ్ చెప్పిందట. ఏ ఇండస్ట్రీలోనైనా హిట్లు .. ఫ్లాపులు కామన్.

హిట్ వచ్చినప్పుడు ఒక అభిమానిగా సంతోషపడటంలో తప్పులేదు. ఫ్లాప్ పడినప్పుడు ప్రాణాలు తీసుకోవడం వలన ప్రయోజనం లేదు. రేపటి రోజున ప్రభాస్ మరింత పెద్ద హిట్ ఇస్తాడు .. అప్పుడు విజిల్స్ వేసి చప్పట్లు కొట్టే అభిమానుల్లో రవితేజలాంటివాళ్లు కూడా ఉండాలిగా. అందుకే ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని అభిమానులను ప్రభాస్ పదే పదే కోరాడు.         
Tags:    

Similar News