ఇంట్రస్టింగ్‌ : రవితేజ.. మ్యాడ్‌.. సూపర్‌ హీరో

రవితేజ కోసం నిర్మాత నాగవంశీ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌ని ఎంపిక చేశాడని తెలుస్తోంది.

Update: 2025-01-19 06:23 GMT

రవితేజ గత ఏడాది ఈగల్‌, మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'మాస్ జాతర' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ జాతర సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నాగవంశీ రెడీ అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తదుపరి సినిమాను సైతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

రవితేజ కోసం నిర్మాత నాగవంశీ ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌ని ఎంపిక చేశాడని తెలుస్తోంది. మ్యాడ్‌ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుంది. మ్యాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన మ్యాడ్‌ 2 సినిమా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మ్యాడ్‌ 2 సినిమా విడుదలకు ముందే సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో వరుసగా మూడో సినిమాకు దర్శకుడు కళ్యాణ్ శంకర్‌ సైన్‌ చేశాడని, ఆ సినిమాను రవితేజ హీరోగా చేయబోతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ్యాడ్‌ సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్‌ మ్యాడ్‌ 2 తోనూ అదే జోనర్‌లో సినిమాను చేస్తున్నాడు. కచ్చితంగా మ్యాడ్‌ 2 విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దర్శకుడు కళ్యాణ్ శంకర్‌ చెప్పిన సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ కి నాగవంశీ, రవితేజ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారని, అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మ్యాడ్‌ 2 ఫలితాన్ని బట్టి ఈ సినిమా పట్టాలు ఎక్కేవ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది. రవితేజ ప్రస్తుతం 'మాస్‌ జాతర' సినిమా చివరి దశ షూటింగ్‌ కి రెడీగా ఉంది. మాస్ జాతర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రవితేజ ఇమేజ్‌కి తగ్గట్లుగా సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ను అందించే విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుందని అంటున్నారు. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌లకు ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్‌ ఉంది. అందుకే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. రవితేజకు ఇప్పటికే నాగవంశీ మరో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు. అందుకే కళ్యాణ్‌ శంకర్‌ చెప్పిన సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ సినిమాను రవితేజతో చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. మ్యాడ్‌ హిట్‌ టాక్ దక్కించుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రవితేజ - కళ్యాణ్‌ కాంబోలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:    

Similar News