ఈ భామ‌లంతా ఏరు దాటిన త‌ర్వాత తెప్ప వ‌దిలేసే టైపై!

Update: 2022-12-30 14:30 GMT
బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత సౌత్ ఇండ‌స్ర్టీపై కొంత మంది  భామా మ‌ణుల అభిప్రాయాలు మారుతున్నాయా?  ఇక్క‌డున్నంత కాలం భ‌జన చేసిన వాళ్లంతా ఉత్త‌రాదికెళ్లిన త‌ర్వాత ప్లేట్ ఫిరాయిస్తున్నారా? అంతా ఏరు దాటిన త‌ర్వాత తెప్ప వ‌దిలేసే టైపేనా?  ఆవేశంలో నోరు జారి అడ్డంగా బుక్కువుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

గోవా బ్యూటీ ఇలియానా ఉన్నంత కాలం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బాలీవుడ్ కి వెళ్లిన కొన్నేళ్ల‌కి..అంటే ఇటీవ‌లే ఇండ‌స్ర్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. దేవదాసు చిత్రంలో నటిస్తున్న సమయంలో దర్శకుడు తనపై కామెంట్లు చేసాడని  ఆరోపించింది. తన నడుముపై ఏదో పడింది.. అది చాలా అందంగా ఉంది అని దర్శకుడు కామెంట్ చేసినట్లు  ఇలియానా తెలిపింది.

ఇంకా   సౌత్ లో చాలా మంది ద‌ర్శ‌కులు  త‌న  నడుముపైనే దృష్టి పెట్టేవారని ఆరోపించింది. 'నడుము అందంగా ఉందని కామెంట్లు చేయ‌డం...పదేపదే ఇలా ఎందుకు కామెంట్ చేస్తున్నారో మొద‌ట్లో  తనకు అర్థమయ్యేది కాదని ఇలియానా ఆరోపించింది. తెలుగు సినిమాల్లో ప‌నిచేస్తున్నంత కాలం ఇలియానా  ఈర‌క‌మైన కామెంట్లు ఏనాడు చేయ‌లేదు.

అలాగే బాలీవుడ్ లో  బిజీ అవుతోన్న మ‌రోన‌టి ర‌కుల్  ప్రీత్ సింగ్ కూడా ఈ మ‌ధ్య‌నే అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో సౌత్ ఇండ‌స్ర్టీ చిన్న‌చూపు చూస్తుంద‌ని ఆరోపించింది. పాన్ ఇండియా చిత్రాల్లో కేవ‌లం కొంత మందికే ప‌నిగ‌ట్టుకుని ద‌ర్శ‌కనిర్మాత‌లు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారని..అక్క‌డ ఈ విధానం మారాలంటూ ఆరోపించింది. హైద‌రాబాద్ నుంచి ముంబై కి మ‌కాం మార్చిన త‌ర్వాత ముంబై ప్లాట్ లోకూర్చుని ఈ వ్యాఖ్య‌లు చేసింది.

అలాగే రాశీఖన్నా కూడా ఇదే త‌ర‌హాలో హీరోయిన్లని తొక్కేస్తున్నార‌ని ఆరోపించింది. సౌత్ వాళ్ల‌కి బొద్దుగా ఉన్న వాళ్లు అంటే ఇష్టం..అలాంటి వాళ్ల‌కే అవ‌కాశాలు క‌ల్పిస్తారని..అన్ని అర్హ‌త‌లు ఇక్క‌డ చూడ‌రంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఈభామ బాలీవుడ్ కి వెళ్ల‌కుండానే వ్యాఖ్యానించింది. ఇక బాలీవుడ్ లో బిజీ అవుతోన్న‌ క‌న్న‌డిగి  ర‌ష్మిక మంద‌న్న కూడా ఇటీవ‌ల సొంత ప‌రిశ్ర‌మపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

స్టార్ హీరోయిన్ అయిన త‌ర్వాత సొంత ప‌రిశ్ర‌మ‌ని మ‌ర్చిపోయి ఇష్టారీతున మాట్లాడుతుంద‌ని..క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి ఆమెని బ్యాన్ చేయాల‌ని నిర్మాత‌లంతా నిప్పులు చెరిగారు. ఆ త‌ర్వాత ర‌ష్మిక వివ‌ర‌ణ ఇవ్వ‌డంతా  వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది.  ఇంకా తాప్సీ ని కూడా ఈ జాబితాలో వేయాలి. ముంబై కి మ‌కాం మార్చిన త‌ర్వాత ఇక్క‌డ లోపాల్ని అమ్మ‌డు ఎత్తి చూప‌డం మొద‌లు పెట్టింది. ఇలా భామ‌లంతా ఏరు దాటిన త‌ర్వాత తెప్ప వ‌దిలేసే  టైపే అనే నిరూపించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News