ప‌రిణీతి పెళ్లి కుదిర్చేందుకు నిక్ బావ దిగాడా?

Update: 2023-04-02 14:37 GMT
ఈడు జోడు కుదిరింది. జంట ముచ్చ‌ట‌గా ఉంది. పైగా స్కూల్ ఫ్రెండ్స్. అందువ‌ల్ల ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపిస్తే చాలు ఏదో జ‌రిగిపోతోందంటూ గుస‌గుస‌లు వినిపించేస్తున్నాయి. కొంద‌రైతే ఏకంగా ఫ్రెండుతో పెళ్లికి రెడీ అవుతున్న ప‌రిణీతి అంటూ హెడ్ లైన్స్ లోకి తెచ్చేస్తున్నారు మ్యాట‌ర్. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ జంట తాము డేటింగ్ లో ఉన్న‌ట్టు కానీ.. పెళ్లి ప్ర‌పోజ‌ల్స్ తెచ్చిన‌ట్టు కానీ ఎలాంటి స‌మాచారం లేదు. ఎవ‌రికి వారు సింపుల్ గా దాగుడు మూత‌లు ఆడేస్తున్నారు.

గ‌త కొన్ని రోజులుగా ఈ జంట ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌క‌పోవ‌డంతో ఈ రూమ‌ర్లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. తాజా స‌మాచారం మేర‌కు పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా ముంబైకి వచ్చారు . ఇక్క‌డ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ల‌ను ఈ రోజు క‌లుస్తారంటూ గుస‌గుస వినిపిస్తోంది. ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో ఈ న‌వ‌జంట‌ కనిపించిన‌ప్ప‌టి నుంచి ఒక‌టే గుస‌గుస‌. ఈ జంట పెళ్లికి వేళాయెను. నిశ్చితార్థం కూడా జ‌రుగుతుంది. అందుకే ప్రియానిక్ జంట ముంబై నగరానికి చేరుకున్నారు... అంటూ ఒక‌టే చ‌ర్చ సాగుతోంది.

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ తో కలసి సంద‌డిగా క‌నిపించింది.  ఈ జంట ఇటీవల కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో పాటు ముంబైలో అడుగుపెట్టారు. త్వరలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలవబోతున్నట్లు తెలుస్తోంది.

పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా జంట‌ నిశ్చితార్థం వివాహ ముహూర్తం ఫిక్స్ చేసేందుకే పారీ అక్కా బావా వ‌చ్చార‌న్న గుస‌గుస వినిపిస్తోంది. పారీ-రాఘ‌వ్ జంట‌ పంజాబ్ నుంచి వెలుప‌ల‌ స్నేహితులుగా మారారు. స్నేహం ప్రేమ‌గా మారింది. త్వరలో వీరు జీవిత భాగస్వాములు అవుతారని ముచ్చ‌ట సాగుతోంది.

AAP రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా పెళ్లి విష‌యంలో కుటుంబాల ప‌రంగా ఏం జ‌రుగుతోంది? అంటే... చాలా సంగతులు తెలియాలి. ఇరువైపులా కుటుంబీకులు ఈ జంట‌ వివాహంపై చర్చలు ప్రారంభించిన తర్వాత ఇద్దరూ ఇటీవల డిన్నర్ డేట్ కి వెళ్లారు. వారు ఒకరికొకరు తెలిసిన స్నేహితులు. కామ‌న్ ఇంట్రెస్ట్స్ కలిగి ఉన్నారు. ఇవ‌న్నీ బాగా క‌లిసొచ్చాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు.  వీరి కుటుంబాలకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఇంకా అధికారిక వేడుక జరగలేదు కానీ కుటుంబ సభ్యులు నిశ్చితార్థం గురించి చర్చించుకుంటున్నారు. త్వరలో ఏదైనా వేడుక జ‌రిగే వీలుంటుంది. ఇద్దరూ కలిసి ఉండటంపై ఇరు కుటుంబాలు సంతోషిస్తున్నాయి. అయితే ఇద్దరూ తమ తమ షెడ్యూల్ లతో బిజీగా ఉన్నందున ఏదైనా వేడుకకు తేదీని నిర్ణయించడం కష్టం. వేడుక చిన్నగా కొద్దిమంది  కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది.

ఈ జంట‌ పెళ్లి సందడి గురించి ప్ర‌శ్నించ‌గా... రాఘవ్  ``ఆప్ ముజ్సే రాజనీతి కే సవాల్ కరియే.. పరిణీతి కే సవాల్ నా కరియే`` అని చెప్పాడు. పెళ్లి గురించి పరిణీతిని అడిగినప్పుడు కేవలం సిగ్గులొల‌క‌బోస్తూ సింపుల్ గా న‌వ్వేసి స్పందించడం మానేసింది. ప్ర‌స్తుతానికి అక్కా బావ అయిన ప్రియాంక‌- నిక్ జోనాస్ ముంబైలోనే ఉన్నారు కాబ‌ట్టి ఈ నిశ్చితార్థ వేడుక జ‌రుగుతుంద‌నే ఆశిస్తున్నారు. మ‌రి మునుముందు ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

Similar News