నా వాళ్లే నన్ను మోసం చేశారు: సీనియర్ నటి

Update: 2022-01-23 08:30 GMT
తెలుగు తెరపై కేరక్టర్ ఆరిస్టుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నవారిలో సుధ ఒకరుగా కనిపిస్తారు. అక్క .. వదిన .. అమ్మ పాత్రలకి కూడా గ్లామర్ ను తీసుకొచ్చిన నటి ఆమె. సుదీర్ఘమైన కెరియర్లో ఆమె తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సీనియర్ హీరోయిన్లు కేరక్టర్ ఆర్టిస్టులుగా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, తట్టుకుని నిలబడటం ఆమె టాలెంట్ కి నిదర్శనం. ఇప్పటికీ కూడా ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ. రీసెంట్ గా తానే ప్రధాన పాత్రగా 'మాతృదేవోభవ' అనే సినిమా చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆ సినిమాతో పాటు, తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

"ఇన్నేళ్ల కెరియర్లో బాగానే సంపాదించాను .. కానీ చాలావరకూ పోగొట్టుకున్నాను. ఇక్కడ స్వీట్ షాప్ పెడితే మా వాళ్లే నన్ను మోసం చేశారు. ఢిల్లీలో మా బ్రదర్ తో కలిసి హోటల్ పెడితే బాగానే నడిచింది. దాంతో అక్కడే మరో హోటల్ పెట్టాము. మొత్తం నష్టం వచ్చేసి మునిగిపోయాము. చివరికి ఎలాగో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాము. చాలాకాలం పాటు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. కొన్ని కుటుంబ సమస్యల వలన చెన్నైకి రావలసి వచ్చింది. మా అబ్బాయి యూఎస్ లో ఉంటాడు. వాడి దారి వాడు చూసుకున్నాడు.

మా అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుంటుంది .. అందువలన తనకి తోడుగా నేను ఇక్కడ ఉండిపోవలసి వచ్చింది. మా అమ్మగారు పోయి 15 ఏళ్లు అయిపోయింది .. కొడుకులు ఉన్నప్పటికీ మా నాన్నకి వాళ్ల సపోర్టు దొరకలేదు. నలుగురు అన్నయ్యలు .. ఒక తమ్ముడికి మధ్య నేను ఉన్నాను. మాకు ఆస్తిపాస్తులు బాగానే ఉండేవి .. మా నాన్నగారు కేన్సర్ బారిన పడటం వలన, ఆ ట్రీట్మెంట్ కి అంతా పోయింది. దాంతో బంధువులంతా కూడా మమ్మల్ని దూరం పెట్టారు. ఆ సమయంలో అనేక కష్టాలు పడుతూ మా అమ్మ మమ్మల్ని ఒకదారికి తీసుకుని వచ్చింది.

చిత్రమేమిటంటే మా నాన్నగారికంటే ముందే మా అమ్మ పోయారు. అప్పుడు కూడా నేను అంతగా బాధపడలేదు. మా నాన్న పోయిన తరువాత నాకు లైఫ్ ఏంటనేది తెలిసొచ్చింది. అందరూ దూరం పెట్టినప్పుడు మా అమ్మకి ధైర్యం చెప్పి .. ఆమె తల ఎత్తుకునేలా చేశాను. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకోగలను. మా నాన్న ఉన్నంతవరకూ మాకు తోడు ఉందనే ధైర్యం ఉండేది. ఆయన పోయిన తరువాత అది కూడా లేకుండా పోయింది. ఒంటరి లైఫ్ అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. మా అబ్బాయి .. మా వారు కూడా యూఎస్ లో హ్యాపీగా వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతున్నారు.

నేను నా పిల్లల గురించి ఏడవడం లేదు .. మా వారి గురించి ఏడవడం లేదు. రేపటి రోజున వాళ్లకి అదే పరిస్థితి వస్తుంది. అది చూడటానికి నేను ఉండను .. ఇదీ లైఫ్. అందరూ పోయారు .. అన్నీ పోయాయి .. కానీ అక్కడి నుంచే ధైర్యం మొదలైంది. మా అమ్మాయికి పెళ్లి అయింది . మనవరాలితో నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఎప్పుడు కోపం వచ్చినా నేను ఆర్గ్యూ చేయను. ఎవరు ఎంత పెద్ద గొడవ చేసినా నేను మాట్లాడాను. మౌనాన్ని మించిన వెపన్ లేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.   
Tags:    

Similar News