'అహింస' షూటింగ్ పూర్తి.. దగ్గుబాటి వారసుడి ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

Update: 2022-09-06 17:00 GMT
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, హ్యాండ్సమ్ హంక్ రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''అహింస''. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేయబడిన 'అహింస' మూవీ.. ఇప్పటి వరకూ అలానే చిత్రీకరణ జరుపుకుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ ఎటువంటి పబ్లిసిటీ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది.

'అహింస' టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తవ్వడంతో ఇప్పుడు మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.

''అహింస'' ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 9 గం. 9 ని. లకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ''ఈ అహింసాత్మక సాగాకు తెర లేపుతోంది. ఫస్ట్ లుక్‌ ని 9-9-22న ఉదయం 9:09 గంటలకు ఆవిష్కరిస్తోంది'' అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 'అహింస' నుంచి ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను వదిలారు. ఇందులో అభిరామ్ ముఖానికి ఒక గోనె సంచి కట్టి అతని చేతులు వెనక్కి కట్టివేయబడి ఉన్నాయి.  ఫుల్ ఫేస్ కనిపించనప్పటికీ.. అతని ముఖం నుంచి రక్తం కారడాన్ని మనం గమనించవచ్చు. ఈ పోస్టర్ తేజ మార్క్ ను గుర్తు చేస్తోంది.

'అహింస' అనేది యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తేజ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అభిరామ్ సరసన గీతికా హీరోయిన్ గా నటిస్తోంది. రజత్‌ బేడీ - సదా - రవి కాలే - కమల్‌ కామరాజు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తేజ చిత్రానికి ఆర్పీ మ్యూజిక్ అందిస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. చంద్రబోస్ ఈ సినిమాలో పాటలన్నీ రాస్తున్నారు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. 'అహింస' ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్తవాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన తేజ.. ఇప్పుడు దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News