అందగత్తెను అక్కగా ఊహించుకోగలడా?

Update: 2015-06-25 11:30 GMT
పాకిస్తాన్‌ జైళ్లలో మగ్గి అక్కడే హత్యకు గురైన ఇండియన్‌ సరబ్‌జిత్‌ జీవితం దేశ ప్రజల్ని కలచివేసే ఓ విషాదం. ఇప్పుడు అతడి జీవితాన్ని వెండితెరకెక్కిస్తున్నారు. మేరీకోమ్‌ ఫేం ఒమంగ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సరబ్‌జిత్‌ సింగ్‌ జీవిత కథని సరబ్‌జిత్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌ కోణంలో విశ్లేషిస్తున్నారు.

దల్బీర్‌ తన సోదరుడు జైల్లో ఉన్నంత కాలం అతడిని విడిపించి బైటికి తేవాలని ఎంతో పోరాడింది. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. పాకిస్తాన్‌ బార్డర్‌ని దాటి పాక్‌ సైన్యానికి చిక్కిన అతడిని ఓ రహస్య గూఢాచారి అంటూ చిత్రహింసలకు గురి చేశారు. జైల్లో వేసి నరకం చూపించారు. చివరికి అన్యాయంగా చంపేశారు. ఈ మొత్తం ఉదంతాన్ని సినిమాగా చూపించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్‌ సరబ్‌జిత్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌ పాత్రలో నటిస్తున్నారు. అయితే కీలకమైన సబర్‌జిత్‌ పాత్రధారి ఎంపిక కోసం ఇంతకాలం వేచి చూశారు.

చివరికి హైవే ఫేం రణదీప్‌ హుడాని ఎంపిక చేసుకున్నారు. రణదీప్‌ ఈ చిత్రంలో సరబ్‌జిత్‌ పాత్రలో నటిస్తున్నాడు. హైవే, కిక్‌ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రణదీప్‌ ఈ చిత్రంతోనూ మెస్మరైజ్‌ చేస్తాడన్న టాక్‌ నడుస్తోంది. అయితే ప్రపంచ సుందరిని తన సోదరిగా ఊహించుకోగలడా? అంతటి అందం ముందు నటనలో ఇమిడిపోతాడా? అని బాలీవుడ్‌లో చర్చించుకోవడం విశేషం.

Tags:    

Similar News