ఐశ్వర్య రాజేశ్ స్పీడ్ మామూలుగా లేదే!

Update: 2021-07-03 10:30 GMT
ఐశ్వర్య రాజేశ్ తన కెరియర్ ఆరంభంలో వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. తమిళంలో అందాలు ఒలకబోసే హీరోయిన్ల ధాటిని కూడా తట్టుకుని నిలబడింది. అక్కడ యువ కథానాయకుల జోడీగా యూత్ ను మెప్పించింది. ఆ తరువాత 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. నాయిక ప్రధానమైన కథతో సాగే సినిమాతోనే ఈ అమ్మాయి పరిచయం కావడం విశేషం. ఆ తరువాత 'మిస్ మ్యాచ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు చేసింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కథ మూడు ట్రాకులలో నడుస్తుంది. అంటే కథానాయకుడి సరసన ముగ్గురు కథానాయికలు కనిపిస్తారు. వాటిలో ఐశ్వర్య రాజేశ్ ట్రాక్ కి ఎక్కువ మార్కులు పడిపోయాయి. ఆ తరువాత ఈ అమ్మాయి ఒక వైపున తమిళంలో గ్యాప్ రాకుండా చూసుకుంటూనే, మరో వైపున తెలుగు సినిమాలు చేస్తూ వెళుతోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి చేతిలో మూడు తెలుగు సినిమాలు .. ఐదు తమిళ సినిమాలు ఉండటం విశేషం. ఈ మూడు తెలుగు ప్రాజెక్టులు మంచివే కావడం ఆమె కెరియర్ కి కలిసొచ్చే అంశం.

దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ జోడీగా ఆమె చేసిన 'రిపబ్లిక్' ఆల్రెడీ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని చేసిన 'టక్ జగదీష్' సినిమాలోను ఐశ్వర్య రాజేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ పాత్ర తనకి చాలా సంతృప్తిని ఇచ్చిందని ఆమె చెబుతూ ఉండటం విశేషం. ఇక 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో ఆమె రానా సరసన కనిపించనుంది. ఇందులోను ఆమె పాత్ర గుర్తుపెట్టుకోదగినదే. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు ఉన్న కారణంగా, ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి హిట్ అయితే ఇక్కడ ఆమె జోరు కొనసాగడం ఖాయమేనని చెప్పుకోవాలి.


Tags:    

Similar News