తమిళ స్టార్ హీరో బుక్కయిపోయాడు

Update: 2016-03-24 07:31 GMT
తమిళనాట స్టార్ హీరోలకు అభిమానులతో పాటు.. యాంటీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా అజిత్ - విజయ్ లకు ఈ తలనొప్పి మరీ ఎక్కువ. వీళ్ల సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల హంగామాతో పాటు.. యాంటీ ఫ్యాన్స్ దుష్ప్రచారం కూడా షురూ అయిపోతుంది. ఏ చిన్న నెగెటివ్ పాయింట్ దొరికినా వాళ్లు రెచ్చిపోతారంతే. ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోయే ‘తెరి’ సినిమా విషయంలో కొన్ని రోజులుగా విజయ్ అభిమానుల సందడి మామూలుగా లేదు. దీని టీజర్ - ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో అజిత్ అభిమానులు ఏం నెగెటివ్ పాయింట్ దొరుకుతుందా అని వెయిటింగ్ లో ఉన్నారు.

ఇలాంటి టైంలోనే మొన్న ఆడియో ఫంక్షన్ లో విజయ్ ఓ మాట తూలి బుక్కయిపోయాడు. ఏదో గొప్పగా మాట్లాడేద్దాం అన్న ప్రయత్నంలో భాగంగా ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జీవిత చరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన కోట్స్ బాగానే ఉన్నాయి కానీ.. చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడైన మావో జెడాంగ్ ను రష్యా నాయకుడని చెప్పడంతోనే వచ్చింది చిక్కంతా. అంత పెద్ద నేత విషయంలో విజయ్ ఇలా మాట్లాడ్డమేంటి.. అంటూ అతడి మీద జోకులు పేల్చడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అజిత్ అభిమానులకు అడ్డూ అదుపూ లేకపోయింది. విజయ్ అజ్నాని అని.. అవివేకి అని.. తమిళనాడు రాహుల్ గాంధీ అని.. రకరకాల ఉపమానాలు జోడించి అతడి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడన్న అంచనాల నేపథ్యంలో.. విజయ్ కూడా ఉద్దేశపూర్వకంగానే మావో జెడాంగ్ పేరు ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. ఐతే విజయ్ చేసిన తప్పిదం మాత్రం అతడికి చాలా ఇబ్బందికర పరిస్థితి తెచ్చిపెట్టింది.
Tags:    

Similar News