అక్కినేని హీరో స్పీడ్ కి అలా బ్రేకులు

Update: 2020-07-12 05:13 GMT
`మ‌జిలీ` లాంటి క్లాసిక్ హిట్ త‌ర్వాత జ‌రంత స్పీడ్ పెంచాడు నాగ‌చైత‌న్య‌. ఆ వెంట‌నే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సున్నిత ఉద్వేగాలు.. రొమాన్స్ ని మేళ‌వించిన ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఎంపిక చేసుకుని సెట్స్ కెళ్లిపోయాడు. క‌మ్ముల‌తో `ల‌వ్ స్టోరి` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌డ‌మే ఆల‌స్యం ఆ వెంట‌నే మ‌రో రెండు ప్రాజెక్టుల‌తో బిజీ కానున్నాడు.

వీటిలో ఒక‌టి మ‌నం ఫేం విక్ర‌మ్.కె ద‌ర్శ‌క‌త్వం వ‌హించేది. వేరొక‌టి ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని స‌మాచారం. విక్ర‌మ్.కె.కుమార్ మూవీని దిల్ రాజు నిర్మిస్తారు. అలాగే ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పరిపక్వ ప్రేమకథలో న‌టిస్తాడ‌ట‌. ఈ చిత్రాన్ని మ‌జిలీ నిర్మాతలు సాహు గారపాటి- హరీష్ పెద్ది నిర్మిస్తారు.

ఈ రెండు సినిమాల్ని ఒకేసారి ప‌రుగులు పెట్టించాలని చైత‌న్య భావిస్తున్నాడ‌ట‌. అంటే సైమ‌ల్టేనియ‌స్ గా షూటింగ్ జ‌రిగేందుకే ఆస్కారం ఎక్కువ‌. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డాల్సి ఉంది. కాస్టింగ్ క్రూ వివ‌రాలు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మ‌హ‌మ్మారీ చైత‌న్య ప్లాన్ కి బిగ్ బ్రేక్ వేసింది. కెరీర్ ప‌రంగా వేగం పెంచాల‌నుకున్న చైతూకి ఇది ఊహించ‌ని ప‌రిణామం అనే చెప్పాలి.
Tags:    

Similar News