టికెట్ రేట్ల వ్యవహారంలో నాగ్ పై ట్విట్టర్ లో ట్రోలింగ్..!

Update: 2022-01-07 03:41 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో సినిమా టికెట్ ధరలతో తన సినిమాకేమీ ఇబ్బంది లేదంటూ అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

‘బంగార్రాజు’ సినిమా విడుదల తేదీ వివరాలను తెలియజేసేందుకు బుధవారం హైదరాబాద్ లో నాగార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో సినిమా టికెట్ల ధరలపై అభిప్రాయం చెప్పమని విలేఖరులు ప్రశ్నించగా.. ''సినిమా స్టేజీ మీద రాజకీయ విషయాల గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను'' అని నాగ్ అన్నారు.

అంతేకాదు ''ఏపీలోని సినిమా టికెట్ల ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు. అంటే నా సినిమా వరకు ఇబ్బంది లేదు. ధరలు ఎక్కువుంటే కొంచెం డబ్బులు ఎక్కువస్తాయి. తక్కువ ఉంటే తక్కువ వస్తాయి'' అని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది.

నాగార్జున మొతం ఇండస్ట్రీ గురించి కాకుండా స్వార్థంతో తన సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏపీలో టికెట్ రేట్లు తన సినిమాకు ఇబ్బంది లేదని మాత్రమే నాగ్ చెప్పారని.. దాన్ని ఇతర సినిమాలకు ఆపాదించి తప్పు పట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు.

మరోవైపు 'సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడకూడదు' నాగ్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినవే అని పలువురు కామెంట్స్ చేశారు. 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే నాగార్జున ఇలా మాట్లాడారని పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నాగ్ వెర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ జరిగింది.

ఈ నేపథ్యంలో నాగార్జున గతంలో సినిమా వేదిక మీద రాజకీయాల గురించి మాట్లాడిన వీడియోలను పవన్ కళ్యాణ్ అభిమానులు బయటకు తీశారు. అందులో నాగ్ ఇండస్ట్రీలోని సమస్య మీద ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ కనిపించారు. దీంతో అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసిన కింగ్.. ఇప్పుడు ఎందుకు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని కామెంట్స్ పెడుతున్నారు.

2010లో 'రగడ' ఆడియా ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడు నాగ్ మాట్లాడింది సినిమా పరిశ్రమకు పెద్ద సమస్యగా మారిన పైరసీ గురించి అని తెలుస్తోంది. ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారే తప్ప.. ఆ స్పీచ్ కి రాజకీయాలతో సంబంధం లేదని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

సినిమా టికెట్ రేట్ల ఇష్యూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినదే కదా.. మరి నాగార్జున ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమా స్టేజి మీద పాలిటిక్స్ మాట్లాడను అని నాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాయి. ఎప్పుడూ లేనంతగా ట్రోల్స్ ఎదుర్కొనాల్సి వచ్చింది. మరి టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున.. మరో వేదిక మీదైనా సినిమా టికెట్ ధరల అంశంపై మాట్లాడతారేమో చూడాలి.
Tags:    

Similar News