13 నెలల్లో 4 వంద కోట్ల సినిమాలు

Update: 2017-02-23 06:04 GMT
బాలీవుడ్లో రికార్డుల పేరెత్తితే అందరికీ ఖాన్ త్రయమే గుర్తుకొస్తుంది. కానీ ఇంకో హీరో చడీచప్పుడు లేకుండా బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లిపోతున్న సంగతి ఎక్కువమంది గుర్తించట్లేదు. అతనే అక్షయ్ కుమార్. ఖాన్ ల మాదిరి 500-600 కోట్ల వసూళ్లు అక్షయ్ సినిమాలు రాబట్టవు. కానీ అతడి సినిమాలంటే మినిమం గ్యారెంటీ. తక్కువలో తక్కువ వంద కోట్లు లాగించేస్తాయి. సినిమాకు మంచి టాక్ వస్తే ఈజీగా వసూళ్లు రూ.200 కోట్లు దాటిపోతాయి. ప్రతిసారీ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో పలకరిస్తూ సినిమా సినిమాకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు అక్షయ్.

గత 13 నెలల్లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలు కనీసం వంద కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. గత ఏడాది జనవరిలో విడుదలైన ‘ఎయిర్ లిఫ్ట్’ కేవలం రూ.30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి.. ఏకంగా రూ.230 కోట్ల వసూళ్లు రాబట్టింది. గత ఏడాది ఇండియాలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘ఎయిర్ లిఫ్ట్’. దాని తర్వాత అక్షయ్ నటించిన మసాలా సినిమా ‘హౌస్ ఫుల్-3’ వరల్డ్ వైడ్ రూ.270 కోట్లు కొల్లగొట్టడం విశేషం. దీని తర్వాత నిరుడు ఆగస్టులో రిలీజైన ‘రుస్తుమ్’ కూడా సూపర్ హిట్టయింది. రూ.216 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. తాజాగా అక్షయ్ ‘జాలీ ఎల్ఎల్బీ-2’తో మరో హిట్టును ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఓపెనింగ్స్ కొంచెం డల్లుగా ఉన్నా.. తర్వాత పుంజుకున్న ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.150 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News