ఫోటో స్టొరీ: ఫిలిం నగర్ చెడ్డీ గ్యాంగ్

Update: 2018-08-13 12:07 GMT
థీమ్స్ లో రెండు రకాలుంటాయి.  రచనల్లో థీమ్ వేరు.. పార్టీల్లో థీమ్ వేరు.  పార్టీలలో మళ్ళీ రెండు రకాలు.. ఒకరిపై మరొకరు బురదజల్లుకొనే రాజకీయ పార్టీలు..  ఫ్రెండ్స్ తో రచ్చ రంబోలా చేసుకునే పార్టీలు.  మరి ఈ రెండో కేటగిరీ పార్టీ లాంటిది వెన్నెల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం. ఈ సమాచారం ఎవరిచ్చారని అడక్కండి.  వెన్నెల కిషోర్ ట్విట్టర్ ద్వారా ఒక థీమ్ పార్టీ ఫోటో పోస్ట్ చేశాడు.  పార్టీ లో ఏం జరిగిందో తెలీదు గానీ పార్టీకి మాత్రం ఒక థీమ్ ఉంది.. అదే 'బ్యాక్ టు స్కూల్'. 

టాలీవుడ్లో ఉన్న చాలామంది కమెడియన్లు ఈ థీమ్ పార్టీకి స్కూల్  యూనిఫామ్ లో హాజరయ్యారు.  యూనిఫామ్ అంటే ఎంచక్కా ప్యాంట్ ఏసుకుని వస్తామంటే కుదరదు.  అందరూ వైట్ షర్టు.. నీలం రంగు నిక్కరు.. మెడకు టై తో రావాలి.  వెన్నెల భయ్యా తో కలిసి మొత్తం 11 మంది.  హాలీవుడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జార్జ్ క్లూనీ సినిమా 'ఓషన్స్ లెవన్' లా నిలబడ్డారు. అదే తెలుగు ఉదాహరణ అయితే చెడ్డీ గ్యాంగ్.  దయచేసి మీరు ఎక్కడికో పోవద్దు.  ఆ చెడ్డీలు వేరు ఈ చెడ్డీలు వేరు. ఇవి కామెడీ చెడ్డీలు. అందర్లోనూ వెన్నెల అన్నయ్యదే పొట్టి చెడ్డీ. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

అన్నట్టు, టాలీవుడ్ కమెడియన్స్ ప్రతినెలా ఇలా మీట్ అయ్యి పార్టీ చేసుకుంటారట.  చాలా నెలల నుండి ఇలా జరుగుతోందట. సూపర్ కదా. మీరు కూడా వీలయితే ఇలాంటిది డిఫరెంట్ గా ప్లాన్ చెయ్యండి. జీవితం ఉండేదే ఇలా ఎంజాయ్ చెయ్యడానికే.. కాదని ఎవరైనా అంటే ఈ చెడ్డీ గ్యాంగ్ ఫోటో చూపించండి.. బుద్ధి తెచ్చుకుంటారు!
Tags:    

Similar News