టాప్ స్టోరి: 2021 పైనే టాలీవుడ్‌ ఆశ‌ల‌న్నీ

Update: 2020-07-29 04:30 GMT
వైర‌స్ క‌ల్లోలం ఆశ‌ల్ని అడియాశ‌ల్ని చేసింది. ఈ ఏడాది ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ వాయిదాలు వేయ‌క త‌ప్ప‌లేదు. క‌నీసం షూటింగులు అయినా పూర్తి చేస్తారా? అంటే ఇంకా సందిగ్ధ‌త నెల‌కొంది. ఇప్ప‌టికే ప‌లు భారీ సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ్డాయి. క‌నీసం అప్ప‌టికి వ్యాక్సిన్ వ‌చ్చినా అంతా స‌జావుగా సాగుతుంద‌నేది అంద‌రి ఆశ‌.

అయితే ఏ స‌న్నివేశం ఎలా ఉన్నా.. ప‌లువురు అగ్ర నిర్మాత‌లు భారీ చిత్రాల నిర్మాణం కోసం ప్రిప‌రేష‌న్స్ చేస్తుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. మ‌నిషి ఆశాజీవి. మంచి రోజులొస్తాయ‌ని ఆశ‌తో జీవించ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు. వినోద‌ప‌రిశ్ర‌మ‌ల‌పై ఎంత పెద్ద పంచ్ పడిపోయినా ప‌లువురు అగ్ర నిర్మాత‌లు త‌మ ప్ర‌ణాళిక‌ల్ని వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇది ప‌రిశ్ర‌మ‌లో ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతోంది. వేలాది సినీకార్మికుల్లో ఉపాధికి భ‌రోసా ఉంటుంద‌న్న ఆశ‌ను పెంచుతోంది.

ముఖ్యంగా ఎస్.ఎస్.రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు మునుముందు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ స్వ‌ర్ణ‌యుగాన్ని చూస్తుంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేయ‌డం చూస్తుంటే ఇది అంద‌రిలో పాజిటివిటీని పెంచుతోంద‌నే చెప్పాలి. దిల్ రాజు.. అశ్వ‌నిద‌త్- రాధాకృష్ణ‌- యువి అధినేత‌లు- అల్లు అర‌వింద్- కొణిదెల ప్రొడ‌క్ష‌న్.. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ అధినేత‌లు .. ఇలా టాలీవుడ్ లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎవ‌రికి వారు భారీ ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు.

రాజ‌మౌళి - దాన‌య్య ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌కు కానుక‌గా ఇవ్వాల‌ని ఆశిస్తున్నారు. దిల్ రాజు రెండు హిందీ సినిమాలను నిర్మించ‌నున్నారు. తెలుగు స్టార్ల‌తోనూ భారీ చిత్రాల్ని ప్ర‌క‌టించే ఆలోచ‌న చేస్తున్నారు. ఇప్ప‌టికి తెర‌కెక్కించిన ప‌లు క్రేజీ చిత్రాల్ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. హారిక‌-హాసిని అండ్ సితార బ్యాన‌ర్ల నుంచి భారీ చిత్రాలు తెర‌కెక్క‌నున్నాయి. ఇప్ప‌టికే అయ్యపనమ్ కోషియం- క‌ప్పేలా లాంటి పొరుగు బ్లాక్ బ‌స్ట‌ర్ల రీమేక్ ల‌కు ఈ సంస్థ‌లు ప్లాన్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాల్లో ఉన్నారు. ప్ర‌భాస్ తో రాధే శ్యామ్ పూర్త‌యితే ప‌లువురు స్టార్ల‌తో యువి క్రియేష‌న్స్ సినిమాలు రానున్నాయి.

డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా వైజ‌యంతి బ్యాన‌ర్ లో నాగ్ అశ్విన్ ఓ భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఎన్టీఆర్ తో అట్లీ మూవీ సెట్స్ కెళ్ల‌నుంది. దుల్కార్ సినిమాని అధికారికంగా ప్ర‌క‌టించారు. మైత్రి బ్యాన‌ర్ ఇప్ప‌టికే అల్లు అర్జున్ తో పుష్ప‌ సినిమా చేస్తోంది. సుకుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ తో స‌ర్కార్ వారి పాట‌.. ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాలు క్యూలైన్ లో ఉన్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ .. గీతా ఆర్ట్స్ లో భారీ చిత్రాలు తెర‌కెక్కే వీలుంది. ఇక వీళ్లంతా ఓటీటీపైనా శ్ర‌ద్ధ పెడుతుండ‌డం కొత్త ఆశ‌ను పెంచుతోంది. వీళ్ల‌తో పాటు అంతో ఇంతో ప‌రిశ్ర‌మ‌పై గ్రిప్ ఉన్న ఎన్నో నిర్మాణ సంస్థ‌లు త‌మ సినిమాల్ని ప‌ట్టాలెక్కించాల‌నే ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నాయి. మ‌హ‌మ్మారీ శాంతిస్తే 2021 అయినా క‌లిసొస్తుంద‌నేదే అంద‌రి ఆశ‌. అది నెర‌వేరాల‌నే ఆకాంక్ష అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News