జాలి చూపులు వద్దంటున్న అల్లరోడు

Update: 2017-07-01 07:21 GMT
ఒకప్పుడు అల్లరి నరేష్ కెరీర్ ఏడాదికి మూడు రిలీజులు.. చేతిలో అరడజను సినిమాలు అన్నట్లుగా ఉండేది. అతడి సినిమా ఒకటి పోయినా.. ఇంకోటి ఆడేసేది. ఫ్లాప్ సినిమాలకు కూడా నష్టాలొచ్చేవి కావు. అందుకే చిన్న.. మీడియం రేంజి దర్శక నిర్మాతలంతా అతడి చుట్టూ తిరిగేవాళ్లు. కానీ ‘సుడిగాడు’ సినిమా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన నరేష్.. ఆ తర్వాత ఐదేళ్లుగా హిట్టు ముఖమే చూడలేదు. వరుస ఫ్లాపులతో అతను బాగా వెనుకబడిపోయాడు. ఒకప్పుడు నరేష్ ఎంతగా నవ్వించాడో గుర్తు చేసుకుని.. అతడి మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ తో.. తనకో హిట్టు వస్తే బావుణ్నే అనుకుంటున్నారు జనాలు. ఐతే ఇలాంటి జాలి చూపులు తనకిష్టం ఉండవని అంటున్నాడు నరేష్. సినిమాల ఎంపికలో తన ఆలోచనలు మారాయని.. ఇకపై తన సినిమాల ఫలితాలు కూడా మారతాయని అతనన్నాడు.

‘‘పాపం.. నరేష్ కు ఒక హిట్ వస్తే బావుంటుంది అని నా మీద అభిమానంతో ఎవరైనా జాలిగా చూస్తే తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలిసి ఎవ్వరూ జాలి చూపులను కోరుకోరు. సినిమాల ఎంపికలో నేను చేసిన తప్పిదాల వల్ల చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒక దశలో నా సినిమాల పోస్టర్లు చూసుకుంటే దాదాపుగా అన్నీ ఒకేలా అనిపించాయి. అందుకే కొంచెం పద్ధతి మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కథల్ని ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాను. ఇంతకుముందులాగా స్పూఫ్ కామెడీలు చేయడానికి అంగీకరించట్లేదు. అలాగని కామెడీని పక్కన పెట్టలేదు. నవ్విస్తూనే కథకు.. భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను. దశాబ్దం క్రితం వచ్చిన చిత్రాల్లోని జోకులకు ఇప్పుడు ఎవరూ నవ్వడం లేదు. కాలంతో పాటు కామెడీ మారుతోంది. ఇప్పుడు అందరూ సటిల్ కామెడీని ఇష్టపడుతున్నారు. మేడ మీద అబ్బాయి షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌ జరుగుతోంది. ఆడియో.. సినిమా విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని నరేష్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News