రొమాంటిక్ మూవీ డైరెక్ట్ చేస్తాడట

Update: 2016-01-05 22:30 GMT
కామెడీ హీరోల్లో అల్లరి నరేష్ ది ప్రత్యేక ట్రెండ్. కేవలం నవ్వులు పూయించే పాత్రలకే పరిమితం కాకుండా.. డిఫరెంట్ జోనర్ మూవీస్ కూడా చేస్తుంటాడు. గమ్యం - నేను - డేంజర్ - శంభో శివ శంభో వంటి చిత్రాలతో నటుడిగానూ మంచి మార్కులు వేయించుకున్నాడు. కామెడీ దర్శక దిగ్గజం ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించిన ఈ కామెడీ హీరోకి.. ఇప్పటివరకూ తీరని కోరిక ఒకటి ఉంది.

అదే తను డైరెక్టర్ గా మారాలని. ఇప్పుడు కాదు.. డైరెక్టర్ కావాలనే ఆలోచన అల్లరి నరేష్ కి ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని చాలాసార్లే చెప్పాడు కూడా. అయితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు బ్యాకెండ్ లో  జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే.. నరేష్ తీయనుంది కేవలం ఒక కామెడీ చిత్రమే కాకపోవడం విశేషం. ఓ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తీయాలని భావిస్తున్నాడట. అది కూడా యువతను ఆకట్టుకునే ఓ రొమాంటిక్ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేయబోతున్నాడు. మరో విషయం ఏంటంటే.. ఇందులో అల్లరి నరేష్ నటించకపోవడం. కేవలం కెమేరా వెనుకే ఉండి అన్ని పనులు చూసుకోవాలని అనుకుంటున్నాడట అల్లరి నరేష్.

దీనికి ప్రత్యేకమైన కారణం కూడా చెప్పాడు. 'అన్నయ్యను హీరో చేయాలని, నన్ను డైరెక్టర్ గా మార్చాలని మా నాన్న అనుకునేవారు. కానీ నేను హీరో అయిపోయాను. చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో పెరగడంతో.. డైరెక్షన్ పై అవగాహన కూడా ఉంది. తండ్రి కోరిక తీర్చేందుకు డైరెక్టర్ గా సినిమా తీయాలని అనుకుంటున్నా' అంటున్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు ఈ కామెడీ హీరో 50 చిత్రాల్లో నటించి ఓ బెంచ్ మార్క్ కూడా పూర్తి చేయడంతో.. ఇక డైరెక్షన్ పై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News