పవన్ ను దాటేసినా బన్నీ సైలెంటే..

Update: 2018-01-03 15:13 GMT
పోయినేడాది వేసవి ముంగిట వచ్చిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ టీజర్.. యూట్యూబ్‌ లో అప్పటిదాకా ఉన్న టీజర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. 24 గంటల్లో అత్యధిక లైక్స్.. అత్యంత వేగంగా కోటి వ్యూస్.. మోస్ట్ లైక్స్.. ఈ రికార్డులన్నింటినీ ఆ టీజర్ దాటేసింది. కానీ ఈ రికార్డులు ఎంతో కాలం నిలవలేదు. అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ కావడం విశేషం. రెండు వారాల కిందట విడుదలైన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’ టీజర్ 24 గంటల్లోనే 64 లక్షల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ వచ్చింది దానికే. సౌత్ ఇండియాలో ‘మెర్శల్’ తర్వాత ఒక్క రోజులో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గానూ ఇది రికార్డు నెలకొల్పింది.

ఐతే ఈ టీజర్ రికార్డు ఎన్నో రోజులు నిలవలేదు. నూతన సంవత్సర కానుకగా విడుదలైన బన్నీ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ టీజర్ (ఫస్ట్ ఇంపాక్ట్ అని పేరు పెట్టారు) 24 గంటల్లో 68 లక్షల వ్యూస్ సాధించి.. ‘అజ్ఞాతవాసి’ రికార్డును బద్దలు కొట్టేయడం విశేషం. అంతే కాక 29 గంటల్లోనే కోటి వ్యూస్ మార్కును దాటేసి.. అత్యంత వేగంగా ఆ మార్కును అందుకున్న తెలుగు టీజర్ గానూ రికార్డు నెలకొల్పింది. ఐతే పవన్ రికార్డును రెండోసారి బద్దలు కొట్టినప్పటికీ ఆ విషయమై పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు బన్నీ టీం. ఎందుకంటే పవన్ అభిమానులతో ఇప్పటికే పేచీ కొనసాగుతోంది. దీనికి తోడు పోయినేడాది ‘డీజే’ కలెక్షన్లు ‘ఖైదీ నంబర్ 150’ వసూళ్లను దాటేశాయంటూ చేసిన ప్రకటన ఎంత వివాదస్పదమైందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా రికార్డు విషయమై అంత హడావుడి చేస్తున్నట్లు లేదు బన్నీ టీం.
Tags:    

Similar News