భాష యాస వేషం అన్నీ మార్చేస్తున్నాడ‌ట‌

Update: 2020-01-25 08:38 GMT
పాత్ర‌లో జీవించేందుకు వెన‌కాడ‌ని స్వభావం మ‌న హీరోల‌ది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ విష‌యంలో చాలా గ్రౌండ్ వ‌ర్క్ చేస్తాడు. ఈసారి ఏకంగా గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌ది స‌మాచారం. చిత్తూరు శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చెట్ల‌ను కొల్ల‌గొట్టే స్మ‌గ్ల‌ర్ల‌తో ప‌ని చేస్తాడ‌ట‌. అత‌డు లారీ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తాడ‌ని కూడా లీకులు అందాయి. ఇంకా అత‌డి పాత్ర‌లో ఎలాంటి మ‌ర్మం దాగి ఉందో అన్న చ‌ర్చా అభిమానుల్ని వేడెక్కిస్తోంది.

లెక్క‌ల మాస్టార్ సుకుమార్ ఒక ప్రాజెక్టును టేక‌ప్ చేశారంటే అందులో స్క్రీన్ ప్లే ప‌రంగా చాలా లాజిక్కులు జిమ్మిక్కులు ఉంటాయి. పాత్ర‌ల ప‌రంగా స‌స్పెన్స్ ఆక‌ట్టుకుంటుంది. రంగ‌ స్థ‌లంలో చిట్టి బాబు పాత్ర‌ ను డిజైన్ చేసిన తీరును మ‌ర్చిపోలేం. ఈసారి ఏఏ 20లో బ‌న్ని పాత్ర‌ను అంతే కొత్త‌గా డిజైన్ చేశాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ ని చిత్తూరు కుర్రాడి గా చూపించేందుకు అత‌డి భాష‌.. వేషం .. న‌డ‌క .. న‌డ‌త అన్నిటినీ మార్చేస్తున్నాడ‌ట‌. ప‌క్కా లోక‌ల్ కుర్రాడిలా తిరుప‌తి - చిత్తూరు యాస‌లో మాట్లాడాల‌న్న‌ది బ‌న్నికి సుక్కూ కండిష‌న్.

దీంతో ప్ర‌త్యేకించి చిత్తూరు యాస‌పై ఒక శిక్ష‌కుడిని నియ‌మించుకుని మ‌రీ బ‌న్ని ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ట‌. ఇటీవ‌లే మేన‌మామ ప్ర‌సాద్ హ‌ఠాన్మ‌ర‌ణం బ‌న్నీకి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మాల అనంత‌రం తిరిగి త‌న ప‌నిలో తాను బిజీ అయ్యాడు. ఫిబ్ర‌వ‌రిలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ఉంటుంది కాబ‌ట్టి అప్ప‌టికి లోక‌ల్ యాస భాష ప్ర‌తిదీ నేర్చుకుని సంసిద్ధంగా ఉంటాడ‌ట‌. శేషాచ‌లం అడ‌వుల్లో షూటింగుల‌కు అనుమ‌తి లేదు కాబ‌ట్టి బ్యాంకాక్ ఫారెస్ట్ స‌హా వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా)లో ద‌ట్ట‌మైన అడ‌వుల్లో షూటింగుకి ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని జోరుమీదున్న‌ రష్మిక ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న‌ క‌థా నాయిక‌గా న‌టిస్తోంది. అంటే ఈ భామ‌ చిత్తూరు అమ్మాయిగా క‌నిపిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News